దేవీపట్నం: గోదావరి నదిలో 61 మందితో ప్రయాణిస్తోన్న టూరిస్ట్ బోటు తిరగబడిన ఘటనలో 12 మంది మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం వద్ద నదిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అధికారులు తెలిపారు. ఇప్పటికే 23 మందిని సురక్షితంగా రక్షించిన సహాయ సిబ్బంది మిగతా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సహాయ బృందాలను, అధికారులను సహాయ కార్యక్రమాలకే అంకితం కావాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఘటనపై విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా ప్రయాణికులు, పర్యాటకులు ప్రయాణించే అన్ని బోట్లు, లాంచీల సేవలను నిలిపేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీచేశారు. అన్ని తరహా పడవలు, లాంచీల అనుమతులు, సైలెన్స్, వర్కింగ్ కండిషన్స్‌ని పరిశీలించాలని సీఎం జగన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఒక్కో బృందంలో 30 మంది చొప్పున 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.