బాలీవుడ్ చరిత్రలో తొలిసారిగా అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మూవీ ఇవాళే థియేటర్లలోకొచ్చింది. అయితే, విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమాకు పైరసీ బెడద తప్పలేదు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం తమిళ్ రాకర్స్ అనే ఓ వెబ్సైట్ ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే సినిమా పైరసీ బారిన పడటంపై మూవీ యూనిట్ సభ్యులతోపాటు అభిమానులు సైతం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వెంటనే పైరసీదారులపై చర్యలు తీసుకుని సినిమాను ఆన్‌లైన్‌లోంచి తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాను యాష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించారు. స్వాతంత్ర్యోద్యమం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ సైతం నటించింది. అమీర్ ఖాన్ తో విజయ్ కృష్ణ ఆచార్య సినిమాను తెరకెక్కించడం ఇది రెండోసారి. గతంలో అమీర్ ఖాన్ నటించిన ధూమ్ 3 సినిమాను ఆయనే డైరెక్ట్ చేశాడు.