బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నిజ జీవితకథను "సంజూ" పేరుతో దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులను తిరగరాస్తోంది. నిర్మాతలకు కాసుల వర్షం కూడా కురిపిస్తోంది. అయితే రణ్‌బీర్ కపూర్ నటించిన ఈ చిత్రంలో అసలు వాస్తవాలను బహిర్గతం చేయలేదని... తాను కూడా సంజయ్ దత్ జీవితకథ ఆధారంగా ఓ సినిమా తీసి ఆ నిజాలను బహిర్గతం చేస్తానని అంటున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
గతంలో ఆర్జీవి సంజయ్ దత్ హీరోగా "దౌడ్" చిత్రం తీశారు. ఆ తర్వాత 2012లో "డిపార్ట్మెంట్" సినిమా తీశారు. సంజూతో తనకున్న బంధం ప్రత్యేకమని.. ఆయనతో కలిసి కొన్నాళ్లు ట్రావెల్ చేశానని చెబుతున్న ఆర్జీవి.. సంజయ్ దత్ జీవితంలో మరో కోణాన్ని ఇప్పుడు తెరపై ఆవిష్కరిస్తానని అంటున్నారు. అయితే తాను తీయబోయే ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారో ఆయన చెప్పలేదు. అయితే సంజయ్ దత్ అసలు జీవితం మీద పూర్తి స్థాయిలో రిసెర్చి చేసి మాత్రమే సినిమా తీస్తానని రామ్ గోపాల్ వర్మ చెప్పడం గమనార్హం.
అసలు సంజయ్ దత్ వద్దకు ఏకే 56 రైఫిల్ ఎలా వచ్చింది.. దానిని కొనడానికి ఆయన ఎవరెవర్ని సంప్రదించారు...? లాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే తను తీసే సినిమా ప్రేక్షకులు చూడాల్సిందేనని అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. బయోపిక్స్ మీద రామ్ గోపాల్ వర్మకి ఉన్న ఆసక్తి ఎప్పుడో సినీ లోకానికి బహిర్గతమైంది. పరిటాల రవి జీవితకథ ఆధారంగా "రక్తచరిత్ర" తీసిన వర్మ, ఆ తర్వాత "వంగవీటి" చిత్రం కూడా తీసి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ అసలు బయోపిక్ తానే తీస్తానంటూ కూడా కొన్నాళ్లు హల్చల్ చేశారు వర్మ. ఇప్పుడు సంజయ్ దత్ రియల్ బయోపిక్ తాను మాత్రమే తీయగలనని కూడా చెబుతున్నారు ఆర్జీవి.