ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి, తమ మద్దతుని అందివ్వమని మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ (మా)ను అడగడం జరిగింది. ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు ఈ సందర్భంగా "మా" సంస్థ ప్రతినిధులను కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలో ‘మా’ ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపిందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రిష్ణ తెలిపారు. ఇటీవలే ప్రత్యేక హోదా విషయంలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఏమీ ఎందుకు మాట్లాడడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం జరిగినప్పుడు అక్కడి సినీ పరిశ్రమలోని వ్యక్తులందరూ ఏకమయ్యారని.. కానీ టాలీవుడ్‌లో ఈ పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి సభ్యులు మా ప్రతినిధులను కలవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మా సంస్థ సభ్యులైన శివాజీరాజా. ఏడిద శ్రీరామ్, మాదాల రవి, బెనర్జీ మొదలైన వారితో పోరాట సమితి సభ్యులు కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో మా సంస్థ కార్యాచరణ ఏమిటన్న విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.