ఆన్లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ వెబ్సైట్ నుండి వస్తువులు ఆర్డర్ ఇచ్చేటప్పుడు.. తాను గమనించిన ఓ సాంకేతిక సమస్యను ఆసరాగా తీసుకొని కర్ణాటక చిక్‌మగళూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు దాదాపు రూ.13 కోట్ల రూపాయలను కొల్లగొట్టడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళితే దర్శన్ అనే యువకుడు ఓ కొరియర్ సంస్థలో పనిచేస్తున్నాడు. తను పలుమార్లు తన డెబిట్ కార్డులు ఉపయోగించి అమెజాన్ నుండి ఆన్లైన్ ద్వారా వస్తువులు బుక్ చేశాడు.
ఈ క్రమంలో తన కార్డుల నుండి డబ్బు డెబిట్ కాకపోయినా.. అమెజాన్ నుండి డబ్బు అందినట్లు మెసేజ్‌లు రావడంతో.. ఆ సాంకేతిక సమస్యను ఆసరాగా చేసుకొని ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నించాడు దర్శన్. సెప్టెంబరు 2017 నుండి ఫిబ్రవరి 2018 నెలల మధ్యలో దాదాపు 4 వేలకు పైగానే వస్తువులను ఆర్డర్ చేశాడు. తన కార్డుల నుండి డబ్బు డెబిట్ కాకపోయినా.. ఎందుకు డబ్బు అందినట్లు మెసేజ్‌లు వస్తున్నాయో తెలుసుకోకుండా.. తన స్నేహితులతో కలిసి మాట్లాడి.. వారికి కూడా వస్తువులు ఆర్డర్ చేయసాగాడు. అలా తాను ఆర్డర్ చేసిన వస్తువుల విలువ రూ.13 కోట్ల రూపాయలకు పైగానే ఉండడం గమనార్హం.
ఇటీవలే అమెజాన్ కంపెనీకి సంబంధించి ఇంటర్నల్ ఆడిట్ జరిగినప్పుడు.. ఈ సంగతి వెలుగులోకి వచ్చింది. డబ్బు చెల్లించకుండానే.. ఓ వ్యక్తి దాదాపు 4 వేలకు పైగానే వస్తువులను ఆర్డర్ ఇవ్వడమే కాకుండా.. వాటిని డెలివరీ తీసుకున్నాడని తెలుసుకొని ఆ కంపెనీ అధికారులు విస్తుపోయారు. ఆ కంపెనీ వాడే అమెజాన్ ఫ్లెక్స్ అనే అప్లికేషన్ ద్వారా ఎంక్వయరీ చేయగా.. డెలవరీకి వస్తువును పంపించేటప్పుడు.. డబ్బు చెల్లించారా లేదా అనే విషయాన్ని కనుగొనే కార్డ్ రీడర్.. కొన్ని కార్డుల ట్రాన్సాక్షన్లను సరైన రీతిలో ఎందుకు గుర్తించలేకపోయిందన్న విషయం అందరినీ అయోమయంలోకి నెట్టివేసింది.
అది అంతర్గతంగా తమకు ఎదురైన సాంకేతిక సమస్యగా గుర్తించింది. అయితే ఆ సాంకేతిక సమస్యను గుర్తించి.. లాభం పొందేందుకు ప్రయత్నించి.. ఫ్రాడ్ చేయడానికి యత్నించిన దర్శన్ పై పోలీసు కంప్లైంట్ ఇచ్చింది అమెజాన్ సంస్థ. పోలీసులు దర్శన్ పనిచేస్తున్న కొరియర్ కంపెనీకి వెళ్లి 21 స్మార్ట్ ఫోన్లు, 4 బైకులు, ఒక ల్యాప్ టాప్, ఒక ఐపాడ్, ఒక యాపిల్ వాచ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో దర్శన్‌కి సహకరించిన ఆయన స్నేహితులను కూడా అరెస్టు చేశారు.