ఐసీసీ ట్విటర్‌లో మోదీ వ్యతిరేక పోస్టు: క్షమాపణ చెప్పిన కౌన్సిల్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ట్విటర్ ఖాతాలో ఈ రోజు పలుమార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన వ్యతిరేక పోస్టులు వైరల్ అయ్యాయి.

Last Updated : Apr 25, 2018, 10:58 PM IST
ఐసీసీ ట్విటర్‌లో మోదీ వ్యతిరేక పోస్టు: క్షమాపణ చెప్పిన కౌన్సిల్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ట్విటర్ ఖాతాలో ఈ రోజు పలుమార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన వ్యతిరేక పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఈ ట్వీట్స్ ఎవరు పోస్టు చేశారో తెలియరావడం లేదు. బహుశా ఐసీసీ ట్విట్టర్ ఖాతాను ఆ సమయంలో ఎవరో హ్యాక్ చేసుంటారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ పోస్టులు వైరల్ కాగానే అనేకమంది మోదీ అభిమానులు ఐసీసీ యాజమాన్యంపై విరుచుకుపడ్డారు.

అంత బాధ్యతారహితంగా ఆ సంస్థ ఎలా వ్యవహరించిందని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఐసీసీ యాజమాన్యం భారత ప్రధాని నరేంద్ర మోదీని క్షమాపణలు కోరింది. ఈ ఘటనను అనుకోకుండా జరిగిన తప్పిదంగా పేర్కొంది. అయితే ట్వీట్ డిలీట్ చేసినా పదే పదే ఎవరో మోదీ వ్యతిరేక ట్వీట్లు అదే ఖాతాలో పోస్టు చేయడం గమనార్హం. కొందరు ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ప్రధానంగా మోదీని టార్గెట్ చేస్తూ, ఆశారాం బాపు మీద వస్తున్న ఆరోపణలతో కూడిన ట్వీట్‌ను ఎవరో ఐసీసీ ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ ట్వీట్ ఎప్పుడైతే బహిర్గతమైందో ఎందరో భారతీయులు ఐసీసీ ట్విటర్ హ్యాండిల్ టీమ్‌ను దుయ్యబట్టారు. వారిని మతి భ్రమించినవారిగా పేర్కొన్నారు. ఆ పోస్టులను వెనువెంటనే డిలీట్ చేయాలని.. లేనియెడల ఐసీసీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని కూడా తెలిపారు.

ఆ పోస్టుకి సంబంధించి బీసీసీఐ ఆఫీసుకి కూడా అనేక ఫోన్లు వచ్చాయి. వెంటనే బీసీసీఐ అధికారులు అప్రమత్తమై ఐసీసీ అధికారులకు సమాచారం అందించారు. అయినా ఆ పోస్టులు చాలా సేపు ట్విట్టర్‌లోనే ఉండిపోవడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థతి ఎదురైంది. ఆఖరికి ఆ ట్వీట్లను డిలీట్ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది

Trending News