శాకాహారం లేదా వెజిటేరియనిజం.. ఇది ప్రస్తుతం బాలీవుడ్‌లో అనేకమంది జపం చేస్తున్న ఆహార మంత్రం. మాంసాహారం కంటే శాకాహారమే మేలని వీరు తెగేసి చెబుతున్నారు. ఒకప్పుడు మాంసాహారులుగా ఉన్న అనేకమంది నేడు శాకాహారులుగా మారి వెజిటేరియనిజంను ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి బాలీవుడ్ నటుల గురించి ఈ రోజు మనం కూడా తెలుసుకుందాం
వివేక్ ఒబరాయ్ - తెలుగులో రక్తచరిత్ర సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ శాకాహారి. ఆయన తండ్రి సురేష్ ఒబెరాయ్ కూడా శాకాహారే. చిన్నప్పటి నుండీ మాంసాహారమంటే పడిచచ్చిన వివేక్ ఒబెరాయ్.. 2009 సంవత్సరం నుండి తన తండ్రి ప్రేరణతో శాకాహారిగా మారిపోయారు.
అనుష్క శర్మ - పెటా సంస్థ నుండి హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీగా టైటిల్ గెలుచుకున్న అనుష్క శర్మ జీవహింసను అరికట్టాలని ఎన్నో రోజులుగా క్యాంపెయిన్స్ చేస్తున్నారు. మూగజీవాల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.
సోనూ సూద్ - మాంసాహారం కంటే శాకాహారంలోనే ఎక్కువ బలం ఉంటుందని నమ్మే నటుడు సోనూ సూద్. కానీ ఆయన గతంలో ఎక్కువగా కోడిగుడ్లు తినవారట. తర్వాత వాటికి కూడా స్వస్తి పలికారు. తన ఫిట్ నెస్ కోసం ఆహారంలో మార్పులు చేసుకున్న ఆయన ఎక్కువగా చిరుధాన్యాలు, సలాడ్స్, రోటీ తినడానికి ఇష్టపడతానని అంటున్నారు.
రేఖ - బాలీవుడ్ యోగినిగా పేరు గాంచిన అలనాటి రేఖ కూడా వెజిటేరియనే. తనకూ ఇప్పటికీ డయాబెటిస్ లాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి కారణం తాను వెజిటేరియన్ కావడమే అని ఆమె ఎప్పుడూ చెబుతూ ఉంటారు.
అమీర్ ఖాన్ - ఒకప్పుడు నాన్ వెజిటేరియన్ అయిన అమీర్ ఖాన్ కూడా తన భార్య కిరణ్ రావ్ ప్రేరణతో వెజిటేరియన్‌గా మారిపోయారట. 15 రకాల రోగాల నుండి మన శరీరాన్ని కాపాడుకోవాలంటే వెజిటేరియన్ కావాల్సిందే అని తన భార్య కిరణ్ చూపిన వీడియోను చూసి అమీర్ మారారట.
అమితాబ్ బచ్చన్ - 1982లో "కూలీ" సినిమా షూటింగులో గాయాల బారిన పడిన అమితాబ్, ఆ తర్వాత మాంసాహారంతో పాటు మద్యపానానికి కూడా స్వస్తిపలికారు. నికార్సయిన శాకాహారిగా మారిపోయారు.
విద్యాబాలన్ - ఒకప్పుడు మాంసాహారం అంటే ఇష్టపడిన విద్యాబాలన్.. ఆ తర్వాత తన డైటీషియన్ సలహా మేరకు పూర్తిస్థాయి వెజిటేరియన్‌గా మారిపోయారు.
షాహిద్ కపూర్ - షాహిద్ కపూర్ కూడా ఒకప్పుడు మాంసాహారేనట. అయితే ఆయన తండ్రి ఇచ్చిన గిఫ్ట్ బుక్ "లైఫ్ ఈజ్ ఫెయిర్" చదివాక వెజిటేరియన్‌గా మారాలని భావించారట. శాకాహారిగా మారడం వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతుంటారాయన.
అలియా భట్ - అనేక సంవత్సరాలుగా మాంసాహారిగా ఉన్న అలియా భట్.. ఉడతా పంజాబ్ అనే సినిమా షూటింగ్ సెట్‌లో తొలిసారిగా తాను వెజిటేరియన్‌గా మారుతున్నానని ప్రకటించారు. తనకు ప్రేరణగా నిలిచిన తండ్రి మహేష్ భట్‌కి ధన్యవాదాలు తెలిపారు.
కంగనా రనౌత్ - కంగనా రనౌత్ కూడా ఎన్నో ఏళ్లుగా మాంసాహారిగా ఉన్నారు. అయితే తాను స్పిరిచ్యువాలిటీ మీద సరైన రీతిలో మనసును కేంద్రీకరించలేకపోతున్నానని చెబుతూ ఆమె శాకాహారిగా మారారట.