K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే

K Viswanath: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రగణ్యుడు. నటుడిగా, దర్శకుడిగా చెరగని ముద్ర వేసిన కళాతపస్వి కే విశ్వనాథ్ ఇక లేరు. తెలుగు సినీ తెరపై సిరివెన్నెల కురిపించిన దర్శక యశస్వి. ఆయన సినీ ప్రస్థానంలో కొన్ని కీలక ఘట్టాలు..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 3, 2023, 09:12 AM IST
K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే

గత కొద్దికాలంలో వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న కే విశ్వనాథ్ కన్నుమూశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కే విశ్వనాథ్ సినీ ప్రస్థానంలో ఎన్నెన్నో విజయాలు. కలికితురాయిలా నిలిచే మరెన్నో సినిమాలు. 50కి పైగా హిట్ సినిమాలను తెరకెక్కించిన ఘనత ఆయనది.

కే విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం ఎంతటి హిట్ సినిమానో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలై నిన్నటికి 43 ఏళ్లు. సరిగ్గే అదే రోజు ఆయన మరణించారు. కే విశ్వనాథ్ పేరు చెబితే శంకరాభారణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ సినిమాలు తప్పకుండా గుర్తుకు రావల్సిందే. 

1957లో తోడికోడళ్లు సినిమాకు సౌండ్ ఇంజనీర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన కే విశ్వనాథ్..నాటి మేటి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, ముగ మనసులు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా ఉన్నారు. తొలిసారిగా 1965లో అక్కినేని నాగేశ్వరరావుతో ఆత్మగౌరవం సినిమా తెరకెక్కించారు. ఫిబ్రవరి 19, 1930న రేపల్లెలో జన్మించిన కే విశ్వనాథ్‌కు తొలి సినిమాతో వెంటనే అవకాశాలు రాలేదు. 

కే విశ్వనాథ్‌కు పేరు తెచ్చిన సినిమా శోభన్‌బాబు హీరోగా వచ్చి చెల్లెలి కాపురం. అందాల హీరో శోభన్ బాబుతో డీ గ్లామర్ రోల్ చేయించి ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన శారద, సిరిసిరి మువ్వ సినిమాలు ఆశించిన విజయాల్ని సాధించాయి. సిరిసిరి మువ్వ భారీ విజయం ఆయన దర్శక జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక శంకరాభారణం సినిమా అప్పట్లో సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. సంప్రదాయ సంగీత మహత్యాన్ని చాటిచెప్పిన సినిమా. కే విశ్వనాథ్ దర్శకత్వంతో పాటు జే వి సోమయాజులు నటన, మహాదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం, బాలు గాత్రం, జంధ్యాల మాటలు అన్నీ సినిమాకు వరంలా పనిచేశాయి.

ఇక కమల్ హాసన్‌తో తీసిన స్వాతిముత్యం సినిమా అప్పట్లోనే భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ ఇచ్చిన ఏకైక తెలుగు సినిమా. ఇక ఆ తరువాత విడుదలైన స్వయంకృషి, స్వర్ణ కమలం, ఆపద్భాంధవుడు, స్వాతి కిరణం సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. విశ్వనాథ్ తీసిన సిరివెన్నెల సినిమాతోనే దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇంటిపేరు సిరివెన్నెలగా మారింది. కే విశ్వనాథ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాకుండా..హిందీలో కూడా తన సినిమాల్ని రీమేక్ చేసి హిట్ సాధించారు. సిరి సిరిమువ్వను సర్గమ్‌గా, శుభోదయం సినిమాను కామ్‌చోర్‌గా, శంకరాభరణం సినిమాను సుర్ సంగమ్‌గా తెరకెక్కించారు.

కే విశ్వనాధ్‌కు రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. 2016లో దేశ సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. దర్శక ధీరుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌కు నివాళి.

Also read: K Viswanath Passed Away: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. కళాతపస్వి అస్తమయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News