రివ్యూ: వ్యూహం (Vyooham)
నటీనటులు: అజ్మల్ అమీర్, వాసు ఇంటూరి, కోట జయరాం, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి పార్వతి, తదితరులు
సినిమాటోగ్రఫీ: సజీష్ రాజేంద్రన్
ఎడిటర్: మనీష్ ఠాకూర్,
సంగీతం: బాలాజీ
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాంగోపాల్‌వర్మ
విడుదల తేది: 2-3-2024
Vyooham Movie Review: తెలుగులో పొలిటికల్ సహా వివిధ వ్యక్తుల బయోపిక్స్ తీయడంలో రాంగోపాల్ వర్మ తోపు అని చెప్పాలి. గతంలో ఈయన దర్శకత్వంలో వచ్చిన పలు బయోపిక్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ కోవలో ఏపీ ముఖ్యమంత్రి ఏపీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. జగన్ యాంగిల్‌లో వర్మ్ తెరకెక్కించిన వ్యూహం ఫలించిందా ? లేదా అనేది చూద్దాం..
కథ విషయానికొస్తే..
వీరశేఖర్ రెడ్డి (వైయస్ రాజశేఖర్ రెడ్డి) చనిపోయిన తర్వాత మదన్‌ను ముఖ్యమంత్రి చేయాలని భారత్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు సంతకాలు చేస్తారు. కానీ భారత్ పార్టీ అధినేత్రి మదన్‌ను కాదని.. కాశయ్యను సీఎం చేస్తారు. ఆ తర్వాత మదన్ (వైయస్ జగన్ మోహన్ రెడ్డి) తన అధిష్ఠానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్ర చేస్తారు. ఆ తర్వాత మదన్ కొత్త పార్టీ పెట్టి.. ముందు ప్రతిపక్ష నేతగా.. ఆపై ముఖ్యమంత్రి కావడంతో ఈ సినిమా ముగుస్తోంది.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు రాంగోపాల్ వర్మ విషయానికొస్తే.. ఈయన గత కొన్నేళ్లుగా తన మార్క్ సినిమాలు తీయలేకపోతున్నాడు. కానీ ఈ సారి ఆర్జీవి.. జగన్మోహన్ రెడ్డి యాంగిల్‌లో వన్ సైడెడ్‌గా తెరకెక్కించాడు. అందరికీ తెలిసిన కథనే సినిమాగా తెరకెక్కించడం అంతా ఆషామాషీ కాదు. ముఖ్యంగా ఈ సినిమాకు సెన్సార్ చిక్కులు రాకుండా ఉండడానికి ఈ సినిమా పూర్తిగా కల్పితంతో పాటు ఇందులోని పాత్రలు, పాత్రధారులు కల్పితం అని చెప్పడం పెద్ద జోక్ అనిపిస్తోంది. అందుకే సినిమాలో పాత్రల పేర్లను పూర్తి మార్చివేసాడు. వై.యస్. రాజశేఖఱ్ రెడ్డి వీరశేఖర్ రెడ్డి అని.. జగన్ రోల్‌ను మదన్ అని.. భారతి పాత్రను మాలతి అని.. రోశయ్య క్యారెక్టర్ కాశయ్య అని.. చంద్రబాబు పాత్రను ఇంద్ర బాబు అని.. పవన్ కళ్యాణ్ రోల్‌ను శ్రవణ్ కళ్యాణ్ అని.. మార్చిపారేసాడు.
ఆలస్యం అమృతం విషం అన్నట్టు ఈ సినిమా లేట్‌గా విడుదల కావడం ఈ సినిమాకు ఒకింత మైనస్ అని చెప్పాలి. యాత్ర 2 సినిమాలో ఉన్నదే వ్యూహంగా తెరకెక్కించాడు వర్మ. యాత్ర 2లో ఉన్న ఎమోషన్ వ్యూహంలో లేకుండా పోయింది. ఇంద్రబాబు పాత్రను పూర్తిగా విలన్‌గా చూపించడంతో పాటు... పవన్ కళ్యాణ్ పాత్రను నెగిటివ్ కమ్ కమెడియన్‌గా ఈ సినిమాలో చూపించాడు. అటు లోకేష్ పాత్రను పూర్తిగా పప్పు సుద్దగా.. తిండిపోతుగా చూపించాడు. ఓ సన్నివేశంలో గోల్డెన్ స్పూన్ బేబి అన్నట్టు.. బంగారం చెంచాతో లోకేష్ తింటున్నట్టుగా ఓ సీన్‌ను తెరకెక్కించాడు. మొత్తంగా ఏపీలో అధికార వైయస్‌ఆర్సీపీకి అనుకూలంగా ఉందనే వాదనలు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అధికారంలో ఉన్న చంద్రబాబును కాకుండా.. ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ను ఓడించడానికే పవన్ ప్రయత్నించాడన్న కారణంతో మన సేన పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన్నట్టు ఈ సినిమాలో చూపించాడు ఆర్జీవి. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్‌లతో వచ్చిన సన్నివేశాలు చూస్తుంటే ఏదో జబర్ధస్త్ స్కిట్ చూసినట్టు అనిపిస్తోంది. వర్మ కూడా తన సినిమాల్లో పాత్రలకు అచ్చుగుద్దినట్టు ఉండే నటీనటులను తీసుకోవడంలో మాత్రమే సఫలమయ్యాడు. కానీ దాన్ని వన్ సైడైడ్‌గా తెరకెక్కించడం మైనస్‌గా చెప్పాలి. మొత్తంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం వైసీపీ పార్టీ అభిమానులకు మాత్రమే నచ్చుతుంది.
నటీనటుల విషయానికొస్తే..
ఈ సినిమాలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించిన అజ్మల్ తన పాత్రలో ఒదిగిపోయాడు. జగన్ హావభావాలను దింపేసాడు. అటు చంద్రబాబు పాత్రలో నటించిన ధనుంజయ్ ప్రభువే ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్, చిరంజీవి పాత్రల్లో నటించిన వాళ్లు పర్వాలేదనిపించారు.
ప్లస్ పాయింట్స్
అక్కడక్కడ మెప్పించే సీన్స్
ఫోటోగ్రఫీ
జగన్ పాత్రలో జీవించేసిన అజ్మల్ అమీర్
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ మిస్
సినిమా నిడివి
రేటింగ్: 2.75/5
Read More: Mango: సమ్మర్ లో మామిడి పండ్లను అతిగా తింటున్నారా..?... ఈ విషయాలు మీకోసమే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.