ఆ ప్రేమబంధం ఒక్కటైన వేళ..!

Last Updated : Oct 7, 2017, 12:45 PM IST
ఆ ప్రేమబంధం ఒక్కటైన వేళ..!

ఏ మాయ చేశావే.. అంటూ ఆమె ప్రేమలో మునిగితేలిన అక్కినేని వారసుడు.. ఆ అందాల భామ చిటికెన వ్రేలు పట్టుకొని.. ఏడడుగులు నడిచి.. వేద మంత్రాల నడుమ పసుపుతాడు కట్టి.. తన ప్రియసఖిని వివాహమాడాడు. గోవాలో శుక్రవారం జరిగిన అక్కినేని నాగార్జున కుమారుడైన నాగచైతన్య మరియు టాలీవుడ్ కథానాయిక సమంతల పెళ్ళి రంగరంగ వైభవంగా జరిగింది. కేవలం ప్రత్యేక ఆహ్వానం పొందిన పలువురు బంధు మిత్రులు, అతిథులు మధ్య జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో, రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఏర్పడిన శుభ ముహుర్తంలో వధు, వరులిద్దరూ ఒక్కటయ్యారు. తొలి రోజు హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్ళి వేడుకలో కళ్యాణ తిలకం దిద్ది వరుడిని అలంకరించారు. మెహందీ కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభమైంది.  ఆ కార్యక్రమంలో భాగంగానే సంగీత్ కార్యక్రమం కూడా జరిగింది. టాలీవుడ్ మేటి హీరోలు నాగార్జున, వెంకటేష్‌ల కుటుంబ సమక్షంలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను తొలుత నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకోగా, ఆ తర్వాత వెంకటేష్ కూడా ట్విటర్ ద్వారా నూతన జంటకు తన విషెస్ తెలియజేశారు. 

గోవాలో డబ్ల్యు హోటల్ వేదికగా జరిగిన కళ్యాణ వేడుకలు మిరుమిట్లుగొలిపే ప్రత్యేకమైన విద్యుత్ దీపాల కాంతుల మధ్య, తీరానికే ఒక అందాన్ని తీసుకువచ్చాయి. ఈ వివాహ వేడుక కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చిన డిజైనర్ దుస్తులను ధరించిన వధువరులు నిజంగానే అలంకరణలో మెరిసిపోయారు. వివాహం జరిగాక చైతన్య, సమంతను ఎత్తుకోగా.. ఆయన నుదిటిపై ముద్దు పెడుతూ ఫోటోలో దర్శనమిచ్చింది ఆమె. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి డ్యాన్సులు చేస్తూ.. వేడుకలో భాగమైపోయారు. ముఖ్యంగా సమంత, సురేష్ బాబు చేసిన నృత్యాల ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. పెద్దగా హైప్ లేకుండా జరిగిన ఈ వివాహ వేడుక, శనివారం కూడా క్రైస్తవ సంప్రదాయం ప్రకారం గోవాలో జరగనుంది. 

 

Trending News