Marakkar OTT Release Date: కరోనా కారణంగా పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీ బాటపట్టాయి. గతకొన్ని రోజులుగా పరిస్థితులు అదుపులోనే ఉండటంతో వరుసగా సినిమాలన్నీ థియేటర్లోనే సందడి చేస్తున్నాయి. అయితే, అందుకు భిన్నంగా ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం అడుగులు వేసింది. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మరక్కార్: అరేబియా సముద్ర సింహం’. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఆంటోనీ పెరంబవూర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఏ ఓటీటీలో విడుదల చేస్తారన్నది అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.
ఇందులో అర్జున్, కీర్తిసురేశ్, సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్ వంటి భారీ తారాగణం నటించిన ‘మరక్కార్’ 2019లోనే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాలకు దాదాపు ఏడాది సమయం పట్టింది. అన్ని పూర్తి చేసుకుని మార్చి 2020లో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. కరోనాతో లాక్డౌన్ విధించటం వల్ల అప్పటి నుంచి ‘మరక్కార్’ విడుదల వాయిదా పడుతూ వస్తుంది. సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత ఈ ఏడాది ఆగస్టు 12న, విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ సమయానికి కేరళలో థియేటర్లు పూర్తిగా తెరవకపోవటం, థియేటర్ యజమానులు, పంపిణీదారులు ఆసక్తి చూపకపోవడంతో విడుదలకు నోచుకోలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా కేరళ సాంస్కృతికశాఖ మంత్రిని నిర్మాత ఆంటోనీ పెరంబవూర్ కలుద్దామని ప్రయత్నించినా అది కుదరలేదు. మరోవైపు సినిమాను ప్రదర్శించాలంటే థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు రూ.40కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలన్న డిమాండ్ నిర్మాత ముందు ఉంచారు. అందుకు ఆంటోనీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత 230 థియేటర్స్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకునేందుకు ‘మరక్కార్’ టీమ్ పత్రాలను పంపగా, అందులో 89మంది మాత్రమే సంతకాలు చేశారు. కొందరు థియేటర్ యజమానులు ముందే వేరే సినిమాలు ఒప్పుకొన్నామని చెప్పారు.
ఈ క్రమంలో ‘మరక్కార్’కు సరైన వేదిక దొరకడం లేదని నిర్మాత భావించారు. దీంతో ఓటీటీలో విడుదల చేసే విషయాన్ని మోహన్‌లాల్, దర్శకుడు ప్రియదర్శన్ ఎదుట ఉంచగా, వారు కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. దీంతో ఓటీటీలో విడుదల చేయటం దాదాపు ఖాయం. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో ‘మరక్కార్’ చిత్ర హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, థియేటర్లో విడుదల కాకుండానే ‘మరక్కార్’కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ వస్త్రాలంకరణ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు దక్కించుకుంది.
Also Read: Vikram - The First Glance : విక్రమ్ - ది ఫస్ట్ గ్లాన్స్ చూశారా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి