Laal Singh Chaddha Review: నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ ఎలా ఉందో తెలుసా?

Laal Singh Chaddha Movie Review in Telugu: అమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ హీరో నాగచైతన్య  కీలక పాత్రలో నటించిన  చిత్రం లాల్ సింగ్ చడ్డా సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2022, 03:01 PM IST
  • ఆమీర్ ఖాన్ హీరోగా లాల్ సింగ్ చడ్డా
  • బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య
Laal Singh Chaddha Review: నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ ఎలా ఉందో తెలుసా?

Laal Singh Chaddha Movie Review in Telugu: అమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమా అమెరికాలో సూపర్ హిట్ గా నిలిచిన ఫారెస్ట్ గంప్ అనే సినిమాకి రీమేక్ కావడం ఆ సినిమాకి అనేక ఆస్కార్ అవార్డులు రావడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. దానికి తగినట్లుగా సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండడం ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగినట్లు ఉన్నదా? లేదా? అనేది సినిమా రివ్యూలో తెలుసుకుందాం. 

కథ:
లాల్ సింగ్ చడ్డా(అమీర్ ఖాన్) పంజాబ్ లోని ఒక సిక్ కుటుంబంలో జన్మించిన ఒక బుద్ధిమాంద్యం గల  కుర్రాడు. కేవలం బుద్దిమాంద్యం మాత్రమే కాక చిన్నప్పుడే సరిగా నడవలేని పరిస్థితుల్లో తల్లి ప్రోత్సాహంతో స్కూల్ కు వెళ్లి అందరిలా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అలా స్కూల్ కు వెళ్లిన సమయంలో రూప(కరీనా కపూర్) అనే తన స్నేహితురాలి ప్రోత్సాహంతో ఎలాంటి అవసరం లేకుండా నడిచేలా మారతాడు. ఎదిగినా సరే చిన్నపిల్లడి మనస్తత్వంతోనే ఉండే లాల్ సింగ్ చడ్డా తల్లి కోరిక మేరకు ఆర్మీలో చేరతాడు. అతనికి బాలరాజు అనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడితో పరిచయం అవుతుంది. ఆర్మీలో సర్వీస్ అయిన తర్వాత బనియన్లు, చెడ్డీల వ్యాపారం మొదలు పెట్టాలని బాలరాజు లాల్ సింగ్ చడ్డాకి చెబుతాడు. కార్గిల్ యుద్ధంలో బాలరాజు చనిపోయిన కొంత మంది సైనికుల ప్రాణాలు కాపాడి లాల్ సింగ్ చడ్డా కూడా బులెట్ గాయాల బారిన పడతాడు. ఆ తరువాత బ్రతికి బట్ట కట్టిన లాల్ సింగ్ ఏం చేశాడు? యుద్ధంలో అతను కాపాడిన పాకిస్థాన్ కు చెందన వ్యక్తి జీవితంలో ఏమయ్యాడు? బాలరాజు చెప్పిన బిజినెస్ ప్లాన్ లాల్ సింగ్ చడ్డాకు వర్కౌట్ అయ్యిందా? లాల్ సింగ్ చడ్డా జీవితంలో రూప ఎలాంటి పాత్ర పోషించింది? తల్లి సాయం లేకుండా నడవలేని స్థాయి నుంచి రాష్ట్రపతి అవార్డు అందుకునే స్థాయికి లాల్ సింగ్ చడ్డా ఎలా చేరగలిగాడు అనేదే సినిమా కథ.

విశ్లేషణ: 
లాల్ సింగ్ చడ్డా,  ఇది అమెరికాలో సూపర్ హిట్ గా నిలిచిన ఫారెస్ట్ గంప్ అనే సినిమాకి భారతీయ అనుకరణ. పాయింట్ ఒకటే అక్కడ నుంచి తీసుకున్నారు కానీ భారతీయులకు తగినట్లుగా అనేక మార్పులు చేర్పులు చేశారు. అయితే ఒక బుద్ధి మాంద్యంతో అంగవైకల్యం బారిన పడిన వ్యక్తి, అంగవైకల్యం నుంచి బయటపడినా అసలు ఆ  బుద్ధి మాంద్యంతో ఆర్మీలోకి ఎలా వెళ్ళగలిగాడు లాంటి అనేక లాజిక్స్ మీద మాత్రం దృష్టి పెట్టలేదు. సినిమాలో చాలా సన్నివేశాలలో లాజిక్స్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సినిమా ఫ్రీ మేక్ కావడంతో దర్శకుడు చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే నాలుగేళ్ల పాటు అలుపెరగకుండా ఒక వ్యక్తి పరిగెట్టడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు కన్విన్సింగ్ గా అనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సినిమాగా చూస్తే ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది అలాగే కొన్నిసార్లు కన్నీళ్లు కూడా తెప్పిస్తుంది. కానీ ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా లేకపోవడం అనేది సినిమాకు పెద్ద మైనస్. అలాగే చాలా చోట్ల లాల్ సింగ్ పాత్రలో అమీర్ ఖాన్ చేసే నటన కొంచెం అతిగా అనిపిస్తుంది. అది అతని పాత్ర తాలూకు స్వభావం కానీ అమీర్ ఖాన్ అలాంటి పాత్రలో నటించడం అనేది ఒక రకంగా ప్రయోగం అనే చెప్పాలి. ఇక బాలరాజు పాత్రలో నాగచైతన్య నటన కూడా తెలుగువారికి ఎబెట్టుగా అనిపిస్తుంది. నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ అంటే ఒక రేంజ్ లో ఊహించుకున్న తెలుగు వారికి నాగచైతన్య పాత్ర మాత్రం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఆ పాత్ర నోటి నుంచి ఎక్కువగా చెడ్డీలు బనియన్లు అనే డైలాగులు తప్ప సాధారణ డైలాగులు పలికించడానికి మేకర్స్ ఇష్టపడలేదు ఎందుకో. పాన్ ఇండియా మార్కెట్ కోసమే తెలుగు హీరోను తీసుకున్నారు తప్ప మరేం లేదనిపిస్తుంది. సినిమా పరంగా చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడంతో ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇక సినిమా ఒక చందమామ కథలా నడిచిపోతూ ఉంటుంది తప్ప, ఎక్కడ కూడా ప్రేక్షకులు కన్విన్స్ అయ్యే అవకాశాలు అయితే లేవు. అదే సినిమాకు ఇబ్బంది కలిగించే అంశం.

నటీనటుల విషయానికి వస్తే
లాల్ సింగ్ చడ్డా సినిమాలో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్లే చెప్పాలి బుద్ధిమాంద్యంతో కూడి అంగవైకల్యంతో పుట్టిన పిల్లాడిగా చిన్ననాటి పాత్ర ఎవరు చేశారో తెలియదు కానీ ఆ చిన్ననాటి పాత్ర చేసిన కుర్రాడు నటన కూడా అద్భుతంగా ఉంది. పెరిగిన తర్వాత ఆమీర్ ఖాన్ నటన ఎక్కడా వంక పెట్టలేని విధంగా ఉంటుంది. అయితే ఆ పాత్ర తాలూకు స్వభావం వల్ల చేసే కొన్ని శబ్దాలతో ఆ పాత్ర చూస్తేనే ఎబెట్టుగా అనిపించే అవకాశాలుంటాయి. కానీ నిజంగా బుధ్యమాంద్యంతో ఉన్నవారు ఇలాగే ఉంటారేమో అనే విధంగా ఆ పాత్రను రూపొందించారు. ఇక ఈ పాత్రకు అమీర్ ఖాన్ తప్ప మరో ఛాయిస్ బాగోదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక రూపా అనే పాత్రలో కరీనా కపూర్ ఒదిగిపోయింది. చాలా ఈజ్ తో నటించి ప్రేక్షకులందతో ఆమె శభాష్ అనిపించుకుంటుంది. ఒక్కోసారి ఆమె పాత్ర చాలా కోపం తెప్పిస్తుంది కానీ చివరికి కన్నీళ్లు తెప్పిస్తుంది. నాగచైతన్య కాస్త ఇబ్బందికరమైన పాత్ర అయినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా నటించాడు. పాత్ర తాలూకు స్వభావాన్ని అర్థం చేసుకొని తనదైన శైలిలో నటించి మెప్పించాడు. ఇక మిగతా పాత్రలలో నటించిన వారు మనకు పెద్దగా పరిచయం లేని వారు కానీ ఎవరి పాత్ర పరిధి మేరకు వారు నటించారు.

టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే 
'లాల్ సింగ్ చడ్డా' సినిమా ఆరు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న 'ఫారెస్ట్ గంప్' చిత్రానికి అధికారిక రీమేక్ అయినా కానీ, ఒరిజినల్ సినిమా చూసిన వారికి ఇది కొత్త సినిమా ఏమో అనిపిస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు అద్వైత్ చందన్ అయినా కథ అందించింది మాత్రం అంటాడు అతుల్ కులకర్ణి, గతంలో అయన కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఇక 'లాల్ సింగ్ చడ్డా' సినిమాకి టెక్నీకల్ టీమ్  ప్రాణం. ఈ సినిమాలో సత్యజిత్ పాండే తన కెమెరాతో ఒక మ్యాజిక్ చేశాడు. ఫారెస్ట్ గంప్ సినిమాను మక్కికి మక్కి దించకుండా పర్ఫెక్ట్ రీమేక్ సినిమా లాగా రూపొందించాడు దర్శకుడు అద్వైత చందన్. ఇండియన్ నేటివిటీకి తగినట్లుగా అనేక మార్పులు చేర్పులు చేశారు. కానీ చాలా చోట్ల లాజిక్స్ మిస్సయ్యారు. కాసేపు కథ ఢిల్లీలో జరుగుతుంది మరికాసేపటికి ముంబైలో నడుస్తుంది ఆ తర్వాత సడన్ గా పఠాన్ కోట్ కి కథ మారిపోతూ ఉంటుంది. ఇలా ప్రేక్షకులు కథను అందుకోవడం కష్టమే. ఇక సినిమా చాలాసార్లు ఏడిపిస్తుంది. అలాగే ఈ సినిమా ఎడిటర్ హేమంతి సర్కార్‌ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది. అమితాబ్ భట్టాచార్య సహా ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతం అందించడానికి చాలా కష్టపడ్డారు కానీ కొన్ని చోట్ల ఆర్ఆర్ ఆలాగే కొన్ని సాంగ్స్ మాత్రమే బాగున్నాయి. సినిమాలో ప్రధానంగా మైనస్ ఏదైనా ఉందంటే అది సంగీతం మాత్రమే. 

ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే
లాల్ సింగ్ చడ్డా సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది కానీ తెలుగు వారికి కనెక్ట్ అవడం కష్టం. పాన్  ఇండియా సినిమా కాబట్టి అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే విధంగా సినిమాని ప్లాన్ చేసుకునే ఉంటే బాగుండేది.  పాత్రలు తెలుగులో మాట్లాడినంత మాత్రాన తెలుగు వారికి కనెక్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయమే. అయితే కనెక్టివిటీ ఉండేలా చూసుకుని ఉంటే సినిమా మరో లెవల్ లో ఉంటుంది. 
 
 
సినిమా: లాల్ సింగ్ చద్దా
నటీనటులు: అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, నాగ చైతన్య, మోనా సింగ్, మానవ్ విజ్ తదితరులు.
రచయిత : ఎరిక్ రోత్ మరియు అతుల్ కులకర్ణి
దర్శకుడు: అద్వైత చందన్
నిర్మాణం: వయాకామ్ 18 స్టూడియోస్ మరియు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్
విడుదల: 11 ఆగస్టు 2022
రేటింగ్ :  2 /5

Also Read: Bimbisara Review: కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా ఎలా ఉందంటే?

Also Read: Chor Bazaar Review : ఆకాష్ పూరి 'చోర్ బజార్' రివ్యూ.. ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News