కత్తి మహేష్ పై పరువునష్ట దావా

ప్రముఖ చలనచిత్ర విమర్శకుడు కత్తి మహేష్ పై నటి పూనమ్ కౌర్ సోదరుడు శ్యాంసింగ్ లాల్ మండిపడ్డారు. 

Last Updated : Jan 8, 2018, 06:40 PM IST
కత్తి మహేష్ పై పరువునష్ట దావా

ప్రముఖ చలనచిత్ర విమర్శకుడు కత్తి మహేష్ పై నటి పూనమ్ కౌర్ సోదరుడు శ్యాంసింగ్ లాల్ మండిపడ్డారు. తన సోదరిపై ప్రశ్నల వర్షం కురిపించిన కత్తి మహేష్ పై పరువు నష్టదావా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇటీవలి కాలంలో నటి పూనమ్ కౌర్ ట్విటర్ వేదికగా కత్తిమహేష్ పేరు వ్యక్తపరచకుండా విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కి మద్దతిస్తూ.. కత్తి మహేష్‌ను ఫాట్సో అని, బిచ్చగాడని ఆమె సంబోధించినట్లు వచ్చిన ట్వీట్ వైరల్ అవ్వడంతో మహేష్ ఆమెపై ప్రశ్నల పరంపర కొనసాగించారు. 

హైదరాబాద్ ప్రెస్ క్లబ్బుకి వచ్చి ఆమె తను సంధించే ఆరు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మీడియా సమక్షంలో అడిగారు. తిరుమలలో పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో పూనమ్ పూజలు ఎందుకు చేయించుకున్నారని.. అలాగే పూనమ్ ఏపీ చేనేత పరిశ్రమలకు బ్రాండ్ అంబాసిడర్ అవ్వడానికి ఎవరు రికమెండ్ చేశారని అడిగారు. అలాగే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో ఎందుకు చేరాల్సి వచ్చిందని.. ఆమె ఆసుపత్రి బిల్లులు ఎవరు కట్టారని కూడా అడిగారు. అలాగే పవన్ పూనమ్ తల్లికి చేసిన ప్రామిస్ ఏమిటో కూడా తెలపాలని అడిగారు. అలాగే త్రివిక్రమ్ అంటే పూనమ్‌కు ఎందుకు కోపామో చెప్పాలని కోరారు. అదేవిధంగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ఆలయంలో రాత్రివేళ క్షుద్రపూజలు చేస్తున్నప్పుడు ఆమె అక్కడ ఏం చేస్తుందో చెప్పాలని కూడా కత్తిమహేష్ అడిగారు.

ఈ రోజు ఉదయం పూనమ్ కౌర్ తనను ఎవరూ ఎలాంటి రాజకీయా విషయాల్లోకి లాగవద్దని.. ఇవి తన కెరీర్ పై ప్రభావం చూపిస్తాయని..దయచేసి ఈ విషయంలో తనకు సహాయం చేయవలసిందిగా కోరుతూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టారు. అయితే కొద్ది సేపటికే ఆ ట్వీట్‌ను ఆమె డిలీట్ చేయడం గమనార్హం. ఆ తర్వాత ఆమె సోదరుడు శ్యాంసింగ్లాల్ స్పందించారు.

కత్తి మహేష్ మాటలు అవాస్తవమని.. పూనమ్ నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) గ్రాడ్యుయేట్ అని, అందుకే ఆమెను చేనేత పరిశ్రమలకు బ్రాండ్ అంబాసిడరుగా నియమించారని తెలిపారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమలో తమకు ఏ నటులతోనూ, దర్శకులతోనూ విభేదాలు లేవని అన్నారు. అలాగే తమది పంజాబీ సంప్రదాయమని, తాము క్షుద్రపూజలు చేయమని కూడా వివరణ ఇచ్చారు. తన సోదరిపై లేనిపోని అవాస్తవాలు కల్పించి చెప్పినందుకు కత్తి మహేష్ పై పరువు నష్టదావా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Trending News