'అజ్ఞాతవాసి' రివ్యూ: అభిమానులకు పండగే..!

పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్ అంటేనే పవర్ స్టార్ అభిమానులకు పండగ. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల్లో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని పవర్‌స్టార్‌ను కొత్తగా చూపించిన ఘనత త్రివిక్రమ్‌దే.

Last Updated : Jan 10, 2018, 01:24 PM IST
'అజ్ఞాతవాసి' రివ్యూ:  అభిమానులకు పండగే..!

చిత్రం: అజ్ఞాతవాసి 

తారాగణం: పవన్‌కల్యాణ్‌, బొమన్‌ ఇరానీ, ఖుష్బు సుందర్, ఆది పినిశెట్టి, కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, రఘుబాబు తదితరులు 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు

సంగీతం: అనిరుధ్‌ 

ఛాయాగ్రహణం: వి.మణికందన్‌ 

దర్శకత్వం: త్రివిక్రమ్‌ శ్రీనివాస్

నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ

బ్యానర్‌: హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ 

విడుదల తేదీ: 10-01-2018 

పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్ అంటేనే పవర్ స్టార్ అభిమానులకు పండగ. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల్లో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని పవర్‌స్టార్‌ను కొత్తగా చూపించిన ఘనత త్రివిక్రమ్‌దే. పైగా ఇది పవర్ స్టార్ నటించిన 25వ చిత్రం కావడంతో, 'అజ్ఞాతవాసి'పై సగటు ప్రేక్షకుడి అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పటికే టీజర్‌తో పాటు ట్రైలర్ కూడా బాగా హిట్ కావడంతో సినిమా ఎలా ఉంటుందన్న ఆసక్తి కూడా సర్వత్రా నెలకొంది.  

కథ: ఏబీ గ్రూప్‌ అనే వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన విందా(బొమన్‌ఇరానీ)తో పాటు ఆయన కొడుకుని కొందరు ఆగంతకులు మర్డర్ చేస్తారు. ఈ క్రమంలో వ్యాపార బాధ్యతలు తీసుకున్న విందా సతీమణి ఇంద్రాణిదేవి (ఖుష్భు), తనకు సహాయంగా ఉండడం కోసం.. అలాగే కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టడం కోసం ఓ వ్యక్తిని అస్సాం నుండి రప్పిస్తుంది. అతనే బాల సుబ్రహ్మణ్యం (పవన్ కళ్యాణ్). బాల సుబ్రహ్మణ్యం కంపెనీ వివాదాలు పరిష్కరిస్తూనే.. మరోవైపు విందా హత్యకు కారణమైన వ్యక్తులను కూడా అన్వేషించడం ప్రారంభిస్తాడు. అయితే ఒకానొక సందర్భంలో ఇంద్రాణి కంపెనీకి తీసుకొచ్చిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం కాదని.. తన పేరు అభిషిక్త్ వర్మ అనే నిజం బయటపడుతుంది. ఇంతకీ అభిషిక్త్ వర్మ ఎవరు? విందా కుటుంబానికి, తనకు ఉన్న సంబంధమేమిటి? తన ప్రత్యర్థి సీతారామ్ (ఆది పినిశెట్టి)తో అభిషిక్త్ వర్మకు వైరం ఎందుకు ఏర్పడింది? ఈ క్రమంలో తనకు ఎదురైన సవాళ్లు ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: నిజం చెప్పాలంటే 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని వన్ మ్యాన్ షోగా చెప్పుకోవచ్చు. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఆయన అభిమానులకు వీనులవిందైన రీతిలో తెరపై ఆవిష్కరించబడింది. ముఖ్యంగా త్రివిక్రమ్ రాసుకున్న సంభాషణలు ఈ సినిమాకి ప్రధాన బలం. ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి ప్రత్యర్థి వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కథానాయకుడు ఎలా సవాళ్లను స్వీకరిస్తాడన్నది పాత విషయమే అయినా.. అదే విషయాన్ని ఈ సినిమా ద్వారా కొత్తగా చూపించడానికి ప్రయత్నించారు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. విలన్ వేషాలతో ఇప్పటి వరకూ ఆకట్టుకున్న మురళీశర్మ, రావు రమేష్‌లలో ఉన్న కామెడీ కోణాన్ని ఈ చిత్రంలో పూర్తిగా చూపించడానికి ప్రయత్నించారు.ఇక  ‘కొడకా కోటేశ్వరరావు’ పాట కేవలం అభిమానుల పల్స్ బీట్ పెంచడానికే అన్నట్లు ఉంది. రఘుబాబు, వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడ మాత్రమే పండింది. ఇక విలన్‌గా కూడా ఆది పినిశెట్టి పాత్రను సరిగ్గా వినియోగించుకోలేదు అనిపిస్తుంది.

అయితే కథాంశం విషయానికి వస్తే.. ఇలాంటి సబ్జెక్టులు గతంలో చాలా రావడం వల్ల.. ప్రేక్షకుడు కొంత రొటీన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఆ రొటీన్ ఫీలింగ్‌ను కవర్ చేయడానికి దర్శకుడు కొన్ని సన్నివేశాలను అల్లుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఫ్రెంచి సినిమా 'లార్గో వించ్' కథను ఈ చిత్రం పోలి ఉందనే విషయం కొంత వాస్తవమే అయినా.. కథనాన్ని వేరేగా డిజైన్ చేసుకోవడం వల్ల దర్శకుడు ఆ ఛాయలు ఏమీ కనబడకుండా జాగ్రత్తపడ్డాడు. ఇక హీరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఇమాన్యువేల్‌కు దక్కిన పాత్రలను కూడా సరిగ్గా ఎలివేట్ చేయలేదు. కానీ అవే పాత్రలు చిత్రానికి గ్లామర్ హంగులు అద్దాయి. ఏదేమైనా.. సినిమా మొత్తాన్ని కథానాయకుడే భుజాన వేసుకొని నడిపించడంతో పాటు.. తన నటనతో ఆకట్టుకోవడంతో... రొటీన్ కథైనా.. ఈ చిత్రం అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు. 

ఓవారల్‌గా.. చెప్పాలంటే ఇది పవర్ స్టార్ ఎనర్జీని పీక్స్‌లో చూపించిన సినిమా.. కానీ కథ కూడా అంతే పీక్స్‌లో లేకపోవడం ఒకింత లోటే.

రేటింగ్: 3/5

Trending News