వైసీపీ చీఫ్ జగన్ ను కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ ముఖ్యనేతల టీం కలవనున్నారు. లోటస్ పాండ్ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ముహుర్తం ఖరారైంది. కాగా ఈ భేటీలో ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ పై చర్చ జరపనున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో ఏపీ రాజకీయాలపై చర్చ జరిగే అవకాశముందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ భేటీ అనంతరం జగన్, కేటీఆర్ లు జాయింట్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశముంది.
రిటర్న్ గిఫ్ట్ కోసమేనా ?
తెలంగాణ ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాల్లో తలదూల్చి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు కేటీఆర్ తో పాటు పార్టీ ముఖ్య నేతల టీంను జగన్ వద్దకు పంపిస్తున్నారు. అయితే కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుందనేది ఈ భేటీ తర్వాత కొంత వరకు కొలిక్కి వచ్చే అవకాశముంది.
ఫెడలర్ ఫ్రంట్ తో జగన్ కలిసి వచ్చేనా ?
లోక్ సభ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ కు అనుకూల వాతావరణం ఏర్పడుకునేందుకే కేసీఆర్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఫ్రంట్ విషయంలో పాజిటివ్ వైబ్రేషన్ రావాలంటే పక్కనున్న తెలుగు రాష్ట్రంలో పట్టుసాధించాల్సి ఉంది. ఏపీలో జగన్ ను గెలిపించుకుని ఫెడరల్ ఫ్రంట్ లో చేర్చకున్నట్లుయితే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించవచ్చనేది కేసీఆర్ వ్యహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫెడలర్ ఫ్రంట్ ప్రతిపాదనను జగన్ ముందు ఉంచుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేసీఆర్ ప్రతిపాదనను జగన్ ఏ మేరకు అంగీకరిస్తారనే అనే విషయం ఈ భేటీలో తేలనుంది.
ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకేనా..?
వైపీపీని బీజేపీ తో లింక్ పెట్టి చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు జగన్ ..ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రాతిపాదిస్తున్న కేటీఆర్ కు దగ్గరవ్వాలనే వ్యూహంతో జగన్ .. టీఆర్ఎస్ నేతలతో భేటీకి అంగీకరించినట్లు టాక్. అయితే ఏపీ ప్రయోజనాల విషయంలో భిన్నంగా వ్యవహరంచే టీఆర్ఎస్ పార్టీ నేతలతో ములాఖాత్ కు జగన్ అంగీకరించడం సాహసోపేత నిర్ణయేనని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నారు. దీంతో తాజా భేటీ ద్వారా జరిగే పరిణామాలు... సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.