Daggubati Purandeshwari Press Meet: ఏపీకి బీజేపి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి ఎదుట ఆ పార్టీ హై కమాండ్ బిగ్ టాస్క్ పెట్టిందని స్వయంగా ఆమె మాటల్లోనే అర్థం అవుతోంది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా రాష్ట్రంలో బీజేపిని బలోపేతం చేసే గురుతర బాధ్యతను బీజేపి పురంధేశ్వరిపై పెట్టింది. ఇదే విషయమై ఆదివారం విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో స్వయంగా పురంధేశ్వరి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అధిష్టానం తనకు అప్పగించిందని అన్నారు. అయితే, కేవలం తన వల్ల ఒక్కరి వల్లే పార్టీ అభివృద్ధి సాధ్యం కాదని.. కార్యకర్తలు, నేతలు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే అది సాధ్యం అవుతుంది అని పురంధేశ్వరి స్పష్టంచేశారు.
ఈ సందర్భంగా పదాధికారుల సమావేశంలో వివిధ స్థాయిల్లో కమిటీల బలోపేతంపై దగ్గుబాటి పురందేశ్వరి నేతలతో చర్చించారు. కమిటీల్లో మార్పు చేర్పులు, సంస్థాగత అంశాలపై నేతలతో కలిసి సమీక్ష చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ, తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయని అన్నారు. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదన్నారు. ప్రతి కార్యకర్త సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. 2014 తర్వాత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారన్నారు. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందని పురంధేశ్వరి తెలిపారు.
ఎన్నికలకు ఇంకో ఐదారు నెలల సమయం మాత్రమే ఉందని.. ఆలోగానే అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాజకీయంగా వేసే అడుగుల పైనా ఆలోచించాలన్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని.. మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందన్నారు. సీఎం ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా న్యాయం జరగని పరిస్థితి నెలకొందని విమర్శించారు. పదో తరగతి పిల్లవాడిని.. ఓ ఉపాధ్యాయుడిని పట్ట పగలు చంపేస్తోన్న పరిస్థితి ఉందన్నారు. యాప్ నొక్కితే చాలు పోలీసులొచ్చేస్తారని సీఎం జగన్ చెప్పారు.. కానీ అలా జరుగుతోందా అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి అన్నారు.. కానీ అది కూడా జరగడం లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే సీఎం జగన్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
Daggubati Purandeshwari: పురంధేశ్వరి ఎదుట బిగ్ టాస్క్