Cheetahs And Bears in Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తాం అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల కొండపైకి వెళ్లే నడకదారిలో గురువారం తెల్లవారు జామున చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డితో కలిసి భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ శాఖ అధికారులను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల కొండల్లో చిరుతల, ఎలుగుబంట్ల సంచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకుంటున్న చర్యలను మీడియాకు వివరించారు. తిరుమల అటవీ ప్రాంతంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యచరణ రూపొందించి, అమలు చేస్తామన్నారు.
వేకువజామున 1:30 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కిందని చెప్పారు. బోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా వెటరినరి డాక్టర్లు నిర్దారించారని అన్నారు. భక్తులకు భధ్రత కల్పిస్తూనే, నడక మార్గంలోకి వచ్చే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది అని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
అటవీ శాఖ అధికారుల ప్రతిపాదన మేరకే నడచి వచ్చే భక్తులకు చేతి కర్రలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. భక్తుల భద్రతలో భాగంగా అటవీ శాఖ సూచనల మేరకు అడవిలో 300 సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, మరో 200 కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. భక్తులకు కర్రలు ఇచ్చి టీటీడీ తన భాధ్యత నుంచి తప్పించుకుంటోందని సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.
ఇటీవల లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి చిరుత దాడిలో మృతి చెందిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం సమావేశమైన టిటిడి హై లెవెల్ కమిటీ.. కొండపైకి కాలినడకన వెళ్లే భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వారి స్వీయ రక్షణ కోసం చేతి కర్ర ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. టిటిడి బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఈ ప్రకటనపై ప్రతిపక్షాలతో పాటు నెటిజెన్స్ సైతం సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ విమర్శలకు సమాధానం ఇస్తూ తాజాగా కరుణాకర్ రెడ్డి మరోసారి ఈ ప్రకటన విడుదల చేశారు.
ఇది కూడా చదవండి : Cheetahs, Bear Spotted in Tirumala: ఒకే రోజు భక్తులను భయపెట్టిన చిరుత పులులు, ఎలుగుబంటి ఘటనలు
తిరుమల కాలినడక మార్గాన సంచరిస్తున్న ఎలుగు బంటి ఫారెస్ట్ అధికారుల చేతికి చిక్కినట్టే చిక్కి మళ్లీ జారుకుంది. చిన్నారి లక్షితపై దాడి ఘటనలో చిరుత పులితో పాటు ఎలుగుబంటిపై కూడా అనుమానం ఉందని అటవీ శాఖ అధికారులు సందేహించిన నేపథ్యంలో ఎలుగు బంటి సంచారం తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లే భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని కూడా బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం లక్ష్మి నరసింహస్వామి ఆలయం సమీపంలో సంచరిస్తున్న ఎలుగు బంటి ఫారెస్ట్ అధికారులు వలకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. ఎలాగైనా ఎలుగుబంటిని బంధించి జూ పార్కుకు తరలిస్తామని టిటిడి ఇఓ ధర్మారెడ్డి స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి : APPSC Group 1 Results: గ్రూప్ 1 ఫలితాలు విడుదల, టాప్ 3 ర్యాంకర్లు మహిళలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.