జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు సభా వేదికపై నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి, రాష్ట్రంలో అవినీతి పెరిగింది అంటూ చేసిన ఆరోపణలపై తెలుగు దేశం పార్టీ స్పందించింది. అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ముందుంది అంటూ పవన్ చేస్తున్న ఆరోపణలు ఇప్పటివి కావని ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అభిప్రాయపడ్డారు. బహిరంగ సభా వేదికలపై నుంచి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని దినకర్, పవన్ కల్యాణ్‌కి హితవు పలికారు. ఏపీలో చంద్రబాబు పరిపాలన గురించి పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. 'పాత నివేదికలను ఆధారంగా చేసుకుని పవన్ కల్యాణ్ చేస్తోన్న ఆరోపణల్లో అసలు వాస్తవమే లేదు' అని దినకర్ స్పష్టంచేశారు.
2015కి ముందు రాష్ట్రం విడిపోవడానికి ముందు 2012-14 మధ్య కాలానికి సంబంధించిన నివేదికలనే పవన్ కల్యాణ్ మళ్లీ ప్రస్తావించారు. వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుండేది. తాజా నివేదికల ప్రకారం దేశంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉందని ఈ సందర్భంగా దినకర్ గుర్తుచేశారు. లోకేశ్‌పై పవన్ కల్యాణ్ చేసిన అవినీతి ఆరోపణల్లోనూ అసలు ఏ మాత్రం వాస్తవం లేదు అని దినకర్ పేర్కొన్నారు. పవన్ కామెంట్స్‌పై పార్టీ వాయిస్ ఎలా వున్నా.. అసలు చంద్రబాబు ఏమని స్పందిస్తారోననేదే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.