ప్రధాని మోదీ నియంతలా ప్రవర్తిస్తున్నారు: జేసీ

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం టీడీపీ ఎంపీలు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Last Updated : Apr 9, 2018, 12:12 AM IST
ప్రధాని మోదీ నియంతలా ప్రవర్తిస్తున్నారు: జేసీ

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం టీడీపీ ఎంపీలు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం, లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రధాని ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన టీడీపీ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాని నివాసం వద్దే ఎంపీలు బైఠాయించి.. ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రధాని ఇంటి వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో టీడీపీ ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని పట్టించుకోవడం లేదంటూ స్వామివారి ఫొటోతో ఎంపీ మాగంటిబాబు నిరసన తెలిపారు.

ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని టీడీపీ ఎంపీలు అంటున్నారు. అరెస్టైన ఎంపీలు మాట్లాడుతూ, మా హక్కుల సాధన కోసమే ఇక్కడికి వచ్చామన్నారు. మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయం చేయమంటే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా ప్రవర్తిస్తున్నారని జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రేమ, కుటుంబం లేని వ్యక్తి అని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంటే కుటుంబం విలువ తెలుస్తుందని ఆయన విమర్శించారు.

తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే బలవంతంగా తరలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎంపీలు అన్నారు. ఈ చర్యతో మోదీ నిరంకుశతత్వం బయటపడిందన్నారు. రాష్ట్రానికి న్యాయం  జరిగేవరకు తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం ప్రధాని మాత్రమే చేయగలరని.. అది జరిగేవరకూ తమ పోరాటం ఇలాగే సాగుతుందని ఎంపీలు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇదొక బ్లాక్‌ సండే అని ఎంపీ సుజనాచౌదరి అన్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సంఘీభావం

టీడీపీ ఎంపీల ఆందోళనకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సంఘీభావం తెలిపారు. ప్రధాని నివాసం వద్ద ఆందోళన చేసిన ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని తుగ్లక్‌ రోడ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎంపీలు ఆందోళనను కొనసాగించారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎంపీల ఆందోళనలో కేజ్రీవాల్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు.

 

Trending News