టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నెల రోజులుగా ఆనం వివేకానందరెడ్డి కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో ఆనం భౌతికకాయాన్ని స్వస్థలం నెల్లూరుకు తరలించనున్నారు. రేపు నెల్లూరులో ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయని తెలిసింది.
1950 డిసెంబర్ 25న నెల్లూరులో జన్మించిన ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు వీఆర్ కాలేజీలో బీకాం చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ నాయకుడిగా ఆనం వివేకానందరెడ్డి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి మూడుసార్లు (1999, 2004, 2009) ఎమ్మెల్యేగా గెలిచారు. ఆనం వివేకానందరెడ్డి ప్రతినిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీరుస్తూ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డితో పాటు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరారు.