రాబోయే ఎన్నికల్లో నిజాయితీగా ఉన్నవారికే అండగా ఉండాల్సిందిగా ఓటర్లకు సూచించే క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గానికి పాతిక కోట్లు ఖర్చు పెట్టడానికి నేతలు సిద్ధంగా వున్నారంటే.. అది నేతలు కష్టపడి సంపాదించిన సొమ్మేం కాదని.. ప్రజా ధనమే అని అన్నారు. ప్రజల సొమ్ముతోనే ప్రజల ఓట్లు కొంటున్నారని ఆరోపిస్తూ... నేతలు ఇచ్చే డబ్బులను ఓటర్లు తీసుకున్నా పర్వాలేదు కానీ ఓట్లు మాత్రం జనసేన పార్టీకే వేయాల్సిందిగా పవన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇంకా అవసరమైతే, దేవుడిపై ఒట్టేసి తీసుకున్నా సరే.. ఓటు మాత్రం జనసేనకే వేయండని పవన్ కల్యాణ్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
నేతలు పంచిపెట్టే డబ్బులను తీసుకునే క్రమంలో ఓటర్లు పాపం సొమ్ము తీసుకుంటున్నామన్న భయం వద్దు. దేవుడితో తాను మాట్లాడతానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనియాంశమైంది. బాధ్యాతాయుతమైన స్థాయిలో వుండి ఓటర్లను డబ్బులు తీసుకోమని చెప్పడం నేరం అని తెలిసి కూడా పవన్ కల్యాణ్ అలా వ్యాఖ్యానించడాన్ని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.