AP POLITICS, Janasena TDP Alliance: బీజేపీకి కటీఫ్.. టీడీపీతో జనసేన డీల్..? హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి సోము వీర్రాజు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం నిజం కాబోతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య పొత్తు దాదాపుగా కుదిరినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా విశాఖలో జరిగిన పరిణామాలు, పవన్ కల్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. చంద్రబాబుతో సమావేశం తర్వాత ఇరు పార్టీల మధ్య పొత్తు దాదాపుగా కుదిరినట్టేననే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాత్రం.. కొంత కాలంగా 2014 తరహా పొత్తుల సంకేతం ఇస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోమని పదేపదే చెబుతున్నారు పవన్ కల్యాణ్. జగన్ ను ఓడించడమే తమ లక్ష్యమంటున్నారు. పవన్ ప్రకటనలతో 2014 తరహాలో ఏపీలోనూ టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి ఏర్పడుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీలో మాత్రం రెండు వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదని స్పష్టం చేస్తుండగా.. మరికొందరు కమలం నేతలు మాత్రం వైసీపీని ఓడించేందుకు విపక్షాలు కలవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా టీడీపీతో కలిసి వెళ్లాలని జనసేన దాదాపుగా డిసైడ్ అయిందంటున్నారు. అందుకే చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చారంటున్నారు.
ఏపీలో గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు-పవన్ కల్యాణ్ సమావేశంతో బీజేపీలో గందరగోళం నెలకొంది. పవన్ తో తమతో ఉంటారా లేదా అన్న అనుమానాలు కమలనాధుల్లో వ్యక్తమవుతున్నాయి. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో బీజేపీ హైకమాండ్ అప్రమత్తమైంది. ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజును హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. పవన్ కల్యాణ్, చంద్రబాబు సమావేశంపైనే సోము తో బీజేపీ పెద్దలు మాట్లాడనున్నారని తెలుస్తోంది. బీజేపీ-జనసేన కలిసి వెళ్లాలా లేక 2014 తరహాలో మూడు పార్టీల కూటమి ఏర్పాటు కానుందా అన్న విషయంలో సోము వీర్రాజుకు పార్టీ పెద్దలు క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. దీంతో సోము వీర్రాజు ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది.
మరోవైపు పొత్తు విషయంలో టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయని తెలుస్తోంది. తమకు పట్టున్న సీట్టపై అవగాహనకు వచ్చిన జనసేన నేతలు.. టీడీపీకి ఓ లిస్ట్ ఇచ్చారంటున్నారు. 30 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నామని, మరో 30 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నామని జనసేన భావిస్తోంది. 60 సీట్లు కావాలని టీడీపీ ముందు డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ మాత్రం 30 సీట్లకు మించి ఇవ్వలేమని చెబుతోందని సమాచారం. మధ్యే మార్గం 40 సీట్లకు జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సిద్దమవుతుందనే టాక్ వస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి