ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేశారు. తన కుటుంబంలోని వ్యక్తులు కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గంలో ఉండడం వల్ల.. తాను రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీనామా పడతానేమోనని పలువురు అన్న మాటలు తనను బాధించాయని.. అందుకే రాజీనామా చేస్తున్నానని పరకాల తెలిపారు.
అయినా తన రాజీనామాను తిరస్కరించినందుకు చంద్రబాబుకి ధన్యవాదాలని.. ఆయన పెద్ద మనసు చేసుకొని తిరస్కరించారని.. కానీ తాను ఈ పదవిలో
ఈ పరిస్థితుల్లో ఇమడలేకే రాజీనామా చేస్తున్నానని పరకాల తెలిపారు. ప్రస్తుతం పరకాల ప్రభాకర్ సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
పరకాల ప్రభాకర్ అనేక సంవత్సరాల నుండి రాజకీయ వ్యాఖ్యాతగా సుపరిచితులు. పలు టెలివిజన్ ఛానళ్లలో రాజకీయ విశ్లేషకునిగా కూడా ఆయన మంచి గుర్తింపు పొందారు. పరకాల ప్రజారాజ్యం పార్టీకి మాజీ అధికార ప్రతినిధి మరియు జనరల్ సెక్రటరీగా ఉండేవారు. సమైక్యాంధ్ర ఉద్యమములో కూడా పరకాల క్రియాశీలకంగా పాల్గొన్నారు.
"విశాలాంధ్ర మహాసభ"కు వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్న పరకాల ప్రభాకర్ తండ్రి శేషావతారం 1970లలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదివిన పరకాల ప్రభాకర్ నరసాపురంలో జన్మించారు.