నవయుగాల బాట.. నార్ల మాట

తెలుగు సాహితీ లోకంలో సామాజిక సంస్కరణకు పెద్దపీట వేసిన మేటి రచయిత "నార్ల వెంకటేశ్వరరావు"

Last Updated : Dec 1, 2017, 06:20 PM IST
    • తెలుగు సాహిత్యంలో హేతుబద్ధతకు పెద్దపీట వేసిన రచయిత
    • సీత జోస్యం, నరకంలో హరిశ్చంద్రుడు, శంబూక వధ నార్ల వారి ప్రముఖ రచనలు
    • శాంతి మార్గమే మానవాళికి శ్రేయస్కరమని నమ్మి బౌద్ధ మతాన్ని స్వీకరించారు నార్ల
నవయుగాల బాట.. నార్ల మాట

తెలుగు పత్రికా రచనను కొత్త పుంతలు తొక్కించిన బహుముఖ ప్రతిభాశీలి మరియు మేధావి ఆయన. మూడు దశాబ్దాల పాటు తెలుగు పాఠకులకు సుపరిచితుడైన ఆయన శతక పద్యాల ద్వారా బాలలకూ చేరువయ్యాడు. రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా బహుముఖ పాత్రలు పోషించిన ఆయన ఛాందస విశ్వాసాలపై రాజీలేని పోరు సాగించి హేతుబద్ధమైన ఆలోచనలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నించారు. జబల్ పూర్‌లో పుట్టిన ఈ తెలుగు తేజం, రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేయడం విశేషం. తెలుగు సాహితీ లోకంలో సామాజిక సంస్కరణకు పెద్దపీట వేసిన  ఆ మేటి రచయితే "నార్ల వెంకటేశ్వరరావు". ఆయన జయంతి సందర్భంగా ఈ వ్యాసం మీకోసం ప్రత్యేకం

డిసెంబరు 1, 1908 తేదీన మధ్యప్రదేశ్‌లో జన్మించిన నార్ల వెంకటేశ్వరావు కృష్ణా జిల్లాలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. చిన్నప్పటి నుండీ రచనా వ్యాసంగమంటే విపరీతమైన ఆసక్తిని కనబరిచిన ఆయన మూడు పదులు కూడా నిండని వయసులోనే సొంతంగా గ్రంథాలయం నడిపారట. దాదాపు 20 వేల పుస్తకాలు స్వయంగా సేకరించారట. స్వరాజ్య, జనవాణి, ప్రజామిత్ర  లాంటి పత్రికలతో ప్రారంభమైన ఆయన జర్నలిజం కెరీర్ ఆ తర్వాత పెద్ద పత్రికల వైపు కూడా మళ్లింది.

పత్రికాభాషను జనాలకు అనువైన రీతిలో చేరువ చేయాలని ఎల్లప్పుడూ అనుకొనే నార్లవారు, చాలా సులభమైన భాషలో పత్రికల్లో వ్యాసాలు రాసేవారు. ఒక పత్రిక ప్రజలను మేల్కొల్పేదిగా ఉండాలే గానీ.. మూఢత్వాలను పెంచే విధంగా ఉండకూడదని భావించిన నార్ల వారు, హేతుబద్ధతను పెంపొందించే రచనలకు ఆయన సంపాదకత్వంలో నడిచే పత్రికలలో స్థానం కల్పించేవారు. మూఢనమ్మకాలపై తిరుగులేని పోరాటం చేసిన ఆయన సీత జోస్యం, శంబూక వధ, జాబాలి లాంటి రచనలతో ప్రజలను ఆలోచించేలా చేశారు. "పైపంట" వంటి నాటికలు కూడా రచించారు. 

'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని నూటికి నూరుపాళ్లు పాటించిన రచయిత నార్ల. తాపీ ధర్మారావు ప్రేరణతో వ్యవహారిక భాషా ఉద్యమం వైపు కూడా అడుగులు వేసిన నార్ల ఆ తర్వాత సర్వమానవాళి సుఖంగా ఉండాలంటే శాంతి సిద్ధాంతమే మార్గమని తలచి బౌద్ధమతాన్ని కూడా అవలంబించారు. వ్యవహారిక భాషకు పెద్దపీట వేసే నార్ల సూక్తులు తెలుగు  పాఠకులకు కంఠోపాఠమే. "యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు" అని చెబుతూ తెలుగులో ఎలాంటి పదాలు వాడాలో.. వాడకూడదో నిజాయతీగా చెప్పిన రచయిత నార్ల.

అలాగే  "ఎంత గొప్పవాడైనా వస్తాడేకాని విచ్చేయడు " అంటారు నార్ల. ఇంకా "బడు వాడేవాడు బడుద్ధాయి" అని అనడం కూడా నార్ల వారికే చెల్లింది. నార్ల వారు పత్రికా రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. బాలలకూ సాహిత్యాన్ని పరిచయం చేయాలని అనుకొనేవారు. అందుకే వారి కోసం నీతి పద్యాలు రాశారు. ‘వాస్తవమ్ము నార్ల మాట’ మకుటంతో రాసి, దానిని తర్వాత ‘నవయుగాల బాట నార్ల మాట’గా మార్చారు ఆయన. కేవలం తెలుగులోనే కాకుండా ఆంగ్లంలో కూడా పలు రచనలు చేశారు నార్ల. ఇంగ్లీషులో భగవద్గీతపై విమర్శనాత్మక రచన చేయగా అది పలు విదేశీ జర్నల్స్‌లో కూడా ప్రచురితమైనది. కలకత్తాలోని సుశీల్‌ముఖర్జీ అనే సంపాదకుడు నార్ల వారి ఆంగ్ల రచనలు కొన్ని వెలువరించారు. 

ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయతీగా, నిర్భీతిగా ఉండాలని కోరే మేటి పాత్రికేయుడు నార్ల. "నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా" అని కుండ బద్దలుగొట్టినట్లు చెప్పడం నార్లవారికే చెల్లింది. అంతలా పత్రికా రంగంతో మేమకమైపోయిన నార్లవారు ఫిబ్రవరి 16, 1985వ తేదీన తుది  శ్వాస విడిచారు. 

Trending News