ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన అఖిల పక్షాల, సంఘాల రెండవ సమావేశం శనివారం మధ్యాహ్నం సచివాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పలు పార్టీల నేతలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ "విభజన సమయంలో అన్యాయం జరిగింది అని పోరాడిన వారు, కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటంలో పాల్గొన్న వారందరినీ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించాం. మూడు ప్రధాన పార్టిలు సమావేశానికి హాజరుకాలేదు. ఈ రోజు కాంగ్రెస్ కూడా రాలేదు. వీరందరూ రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకోసం ఆలోచించలేదు. అందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకే మొదటి విడత అఖిలపక్షాల, సంఘాల సమావేశం నిర్వహించాం. ఆనాటి సమావేశంలో చేసిన తీర్మానం మేరకు ఢిల్లీలో రెండు రోజులు పర్యటించాను.
పార్లమెంటు సెంట్రల్ హాలులో చాలా కాలం తరువాత తొలిసారి అడుగుపెట్టాను. పార్లమెంటులో నేషనలిస్టు కాంగ్రెస్ నేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫారూక్ అబ్దుల్లా, శిరోమణి అకాలీదళ్ నేత హర్సిమ్రాత్ కౌర్, టీఎంసీ నేత సుదీప్ బంధోపాధ్యాయ, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, సీపీఐ నేత డి.రాజా, ఎ.ఐ.ఎ.డి.ఎం.కె నేత వి.మైత్రేయన్, అప్నాదళ్ నేతలు అనుప్రియాపటేల్, రామ్‌గోపాల్ యాదవ్ తదితరులతో భేటీ అయ్యాను. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ కూడా కలిశారు. అన్ని రాజకీయ పక్షాలు మన న్యాయమైన కోర్కెల పట్ల సానుకూలంగా వున్నాయి. రెండో రోజు నేషనల్ మీడియాకు ఇంటర్వ్యులు ఇచ్చి నరేంద్రమోడీ రాష్ట్రానికి చేసిన వాగ్దానాలను గుర్తుచేశాను.
మనమీద విష ప్రచారానికి పూనుకున్నారు. రాజకీయ లాభం కోసమే టీడీపీ ఎన్టీఏ నుంచి బయటకు వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. మా హక్కుల కోసమే ఢిల్లీ వచ్చానని ప్రతి ఒక్కరికీ చెప్పాను. రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చానని తెలిపాను. ఢిల్లీలో నరేంద్రమోడీకి ఎదురు నిలవడం ద్వారా మొదటిసారి మన సమస్యల్ని జాతీయస్థాయిలో అందరి దృష్టికి తీసుకువెళ్లడంలో ఢిల్లీ పర్యటన సక్సెస్ అయ్యింది.గోద్రా ఘటన దరిమిలా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీని రాజీనామా చేయమని డిమాండ్ చేసింది నేనే. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో మా అంతట మేము వెళ్లి పొత్తు కోసం వెంపర్లాడలేదు. నరేంద్రమోడీ తనంతట తాను వచ్చి మీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మీ సమస్యల పట్ల మాకు సానుభూతి ఉంది. మాతో కలిసి రండి. ఉమ్మడిగా రాష్ట్రాభివృద్ధిక కృషిచేద్దాం అని ప్రతిపాదించడంతో అన్నీ ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నాను.
మేము అనుకుంటే పోలవరం, అమరావతిలకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా ఆపేవాళ్లం అని ప్రకాశ్ జవదేకర్ వంటి వాళ్లు ఇప్పుడు అంటున్నారంటే నేను రెండేళ్ల క్రితమే మేము బయటికి వచ్చి వుంటే ఇంకా ఎంతగా వేధించేవారో అర్థం చేసుకోవాలి. తెలుగు ఆత్మగౌరవం, కన్నడ ఆత్మగౌరవం, తమిళ ఆత్మ గౌరవం అంటూ హేళనగా మాట్లాడారు. మీరు అడిగిందల్లా చేయడానికి ఇది వాజ్‌పేయి ప్రభుత్వం అనుకున్నారా..? మోడీ ప్రభుత్వం అని కూడా అన్నారు.
నా మీద అన్ని రకాల వత్తిళ్లు వస్తాయని నాకు తెలుసు. ముందు ముందు వాళ్లు మన రాష్ట్రం పట్ల ఎలా వ్యవహరిస్తారో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఏం చేయాలో అందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకే అఖిలపక్షాల, సంఘాల సమావేశం ఏర్పాటు చేశాం. మనం పూర్తిగా కేంద్రంపై ఆధారపడిపోతామని ఎప్పుడూ అనుకోలేదు. కష్టపడి పనిచేసే తత్వం మనది. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకు కేంద్రం ఊతమిస్తుందని ఆశిస్తే నమ్మకద్రోహం చేశారు. " అని చంద్రబాబు ఈ సమావేశంలో తెలిపారు.