రూ.1200కే ...ఆరోగ్య రక్ష

Last Updated : Aug 18, 2017, 05:38 PM IST
  • ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్
  • ఇక నుంచి ఆందరికీ ఆరోగ్య భద్రత
  • రూ.1200 కే ...ఆరోగ్య రక్ష
  • ప్రైవేటు హెల్త్ ప్రీమియం కంటే నాలుగు రెట్లు తక్కువ
  • ఏపీ ప్రజలందరూ అర్హులే..
  • దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31
రూ.1200కే ...ఆరోగ్య రక్ష

రూ.1200కే ...ఆరోగ్య రక్ష

ఈ రోజుల్లో చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తినా హాస్పిటల్ బిల్లులు తడిసి ముద్దవుతున్నాయ్...సామాన్య, మధ్యతరగతి జనాలు భరించలేని పరిస్థితి . అసలే ఆకాశానంటుతున్న నిత్యావసరాల ధరలు, పిల్లల స్కూలు ఫీజులు, ఇంటి అద్దెలు పెనుభారంగా మారాయి. చాలి చాలని జీతంతో కనీస అవసరాలే తీర్చుకోలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో కూడా ఆరోగ్య భద్రత కోసం ఎంతోకంతా వెచ్చించి హెల్త్ ప్రీమియం తీసుకుందామనుకుంటే వేల రూపాయలు ధారపోయాల్సి వస్తోంది. ఇక బీపీ,షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే ఇక అంతే సంగతులు.. సాధరణం కంటే అధికమొత్తంలో చెల్లించాల్సి వస్తోంది.

ఆకస్మికంగా అనారోగ్యానికి గురైతే ఏం చేయాలి..వాటి ఖర్చు ఎలా భరించాలనే దిక్కుతోచనిస్థితిలో మిడిల్ క్లాస్ మెన్  నలిగిపోతున్నాడు. అయితే ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండబోదు.. ఎందుకంటే అందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ "ఆరోగ్య రక్ష" అనే సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. దీన్ని అనుసరించి ప్రతి వ్యక్తి..తన వయస్సు., ఆరోగ్య స్థితితో సంబంధం లేకుండా ఏడాదికి రూ. 1200 ప్రీమియం చెల్లిస్తే చాలు..అది కూడా వాయిదా పద్దతిలో నెలకు రూ.100 మాత్రమే. ఈ విధంగా ప్రీమియం కడితే ఏడాది పాటు రూ. 2 లక్షల వరకు  రాష్ట్రంలోని 400కుపైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. 

ఆరోగ్య రక్ష ఉద్దేశం...

మనషి ప్రాధమిక అవసరాల్లో ఒకటి వైద్యం.. అలాంటి వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ పథకం కేవలం తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగూ హెల్త్ కార్డుల ద్వారా ఆరోగ్య సేవలు పొందుతున్నారు. అయితే మిగిలిన ప్రజానికానికి ఉచిత వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏపీలో 30 లక్షల మంది ప్రభుత్వం అందించే వైద్య పథకాలను అందుకోలేకపోతున్నారని తేలింది. ఇలాంటి వారికి ఆరోగ్య రక్ష పథకం అమలు చేస్తున్నారు. 

ఆరోగ్య శ్రీ ఉంది కదా.. ఇంకెందుకిది..?

ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా..ఇక 'ఆరోగ్య రక్ష' స్క్రీం ఎందుకనే ప్రశ్న ఉత్సన్నమవుతోంది కదూ. ఆరోగ్యశ్రీ పథకం ద్వార పరిమిత రోగాలకు మాత్రమే చికిత్సనందిస్తున్నారు. దీని పరిధిలో లేని రోగాలకు డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. ఈ స్థితి నుంచి బయపడేందుకు ఆరోగ్య రక్ష స్కీంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్య శ్రీ పరిధిలో లేని అనేక రోగాలకు ఆరోగ్య రక్ష పథకం ద్వార చికిత్స పొందవచ్చు. మధ్య తరగతి ప్రజలతో పాటు తెల్లరేషన్ కార్డులు కలిగిన పేదలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేస్తుకోవచ్చు.

అతి తక్కువ ప్రీమియంతో ఆరోగ్య రక్ష ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎవరైనా ఈ పథకం ద్వార వైద్య సేవలను పొందవచ్చు. ఈ పథకంలో చేరాలంటే ఒక్కో వ్యక్తి ఏడాదికి రూ.1200 చెల్లించాలి..ప్రైవేటు సంస్థల అందించే ప్రీమియంతో  పోల్చితే ఇది నాలుగు రెట్లు తక్కువ. అలాగే సభ్యుల ఆరోగ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకునే వీలుంది. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులన్న వారు కూడా అధిక మొత్తం చెల్లించకుండానే ఈ పథకంలో చేరవచ్చు. 

సభ్యత్వం ఎలా పొందాలి...

మీ దగ్గర్లో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసువచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 31 డిసెంబర్ 2017. ఈ వ్యవధిలో దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని అధికారులు వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ప్రయోజనాలు:

* ఏపీలో 13 జిల్లాలో ఉన్న 410 ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు
* ఆస్పత్రిలో ఉన్నప్పడు వైద్యంతో పాటు భోజనం అందిస్తారు
* డిశ్చార్జ్ సమయంలో 11 రోజులకు సరిపడ మందులిస్తారు
* బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్నా అధిక ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు
మరిన్ని వివరాల కోసం 18005991111 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయవచ్చు.

Trending News