ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఈ నెల 11న జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే వైసీపీలో తాను చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీడీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని మహీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈయన గతంలో వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. గత కొన్నాళ్లుగా మహీధర్ రెడ్డి వైసీపీలోకి చేరనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయనే స్వయంగా ఆ విషయాన్ని ధ్రువీకరించారు.
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం మహీధర్ రెడ్డి వహించారు. 1989-1994, 2004-2014 ఎమ్మెల్యేగా సేవలందించారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించాడు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలోకి జంప్ కావడంతో మహీధర్ రెడ్డికి వైసీపీలో చేరడానికి మార్గం సుగుమమైంది. మహీధర్ చేరికతో ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి ఆనం కూడా వైఎస్ జగన్తో సమావేశం అయ్యారు. దీంతో ఆయన కూడా వైసీపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.