కోల్‌కతా:లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉన్న కొద్ది సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను కలియచుట్టేందుకు నేతలు వ్యూహరచనలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ 14 రోజుల్లో దాదాపు 100 ఎన్నికల ప్రచార సభలకు హాజరయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా.. ఒక్కో నియోజకవర్గంలో కనీసం రెండేసి ప్రాంతాల్లో మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం సభలు చేపట్టనున్నారు.
ఇక దేశంలో ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకుగాను తాను అస్సాం, ఆంధ్రప్రదేశ్‌లలోనూ ప్రచారం చేపట్టనున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు. టీఎంసీ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మమతా బెనర్జీ ఈ వివరాలను వెల్లడించారు. మార్చి 31న ఆంధ్రప్రదేశ్‌లో టీడీపికి మద్దతుగా తాను ఓ ప్రచార సభకు హాజరుకానున్నట్టు మమత తెలిపారు.
జనవరి 19న కోల్‌కతాలో టీఎంసీ నేతృత్వంలో జరిగిన మెగా అపోజిషన్ ర్యాలికి మద్దతు తెలియజేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ సైతం ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు పార్టీకి మద్దతు పలికేందుకు రావాలని నిర్ణయించుకున్నారు.