విశాఖలో జరిగిన పరిణామాలు రాష్ట్రంలో కీలకమార్పులకు కారణమయ్యాయి. హఠాత్తుగా పాతమిత్రులు తిరిగి ఏకమయ్యేందుకు కారణమైంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు సంయుక్తంగా మీడియాతో మాట్లాడిన విషయాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
విశాఖ ఎపిసోడ్ విషయంలో పవన్ కళ్యాణ్‌ను తొలుత ఫోన్‌లో మాట్లాడి సంఘీభావం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఆ మరుసటి రోజు మరో ఎత్తు వేశారు. విశాఖ నుంచి నేరుగా విజయవాడ చేరుకున్న పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు నాయుడు నోవాటెల్ హోటల్‌లో కలుసుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కలసికట్టుగా పోరాటం చేస్తామని ఇద్దరూ కలిసి పిలుపునిచ్చారు. పొత్తు విషయాన్ని ఖండించకుండా సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తామని చెప్పారు. ఈ పరిణామాలపై టీడీపీ-జనసేన పొత్తు దాదాపుగా ఖరారైందనే చర్చ ప్రారంభమైంది.
ఈ పరిణామాలతో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. ముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఢిల్లీకు పిలిపించారు. ఆ వెనుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే రావల్సిందిగా పిలిచారనే వార్తలు వస్తున్నాయి. దీంతో జనసేనాని మద్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆకస్మిక ఢిల్లీ పర్యటనకు ఏర్పాట్లు కూడా బీజేపీ కేంద్ర అధిష్టానమే చేసినట్టు సమాచారం.
టీడీపీ-జనసేన బంధానికి బ్రేక్ వేసేందుకేనా
హఠాత్తుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకు పిలిపించడం వెనుక రాజకీయ కారణాలున్నాయని తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో టీడీపీని ఏకాకి చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యం. జనసేన కలిస్తే టీడీపీ బలపడుతుంది. ఇది బీజేపీకు ఇష్టం లేదు. దీనికి రెండు కారణాలున్నాయి. బీజేపీ ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఎదగకపోవడానికి కారణం టీడీపీ వైఖరేనని ఆ పార్టీ అధినేతల అభిప్రాయం. మరోవైపు ఏపీలో నమ్మకమైన మిత్రుడిగా ఉన్న వైఎస్ జగన్‌ను దూరం చేసుకోవడం బీజేపీ అగ్రనాయకత్వానికి ఇష్టం లేదు. ఇందులో భాగంగానే జనసేనాని పవన్ కళ్యాణా్‌ను హుటాహుటిన పిలిపించినట్టు సమాచారం.
అదే సమయంలో మరో వాదన కూడా నడుస్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ అంటే 2014లో ఏర్పడిన కూటమి తిరిగి కొనసాగవచ్చని..అందులో భాగంగానే బీజేపీ, జనసేన నాయకత్వాన్ని ఢిల్లీకు రప్పించుకుందని కొందరి వాదన. పవన్ కళ్యాణ్ ఢిల్లీకు వెళ్తున్నట్టుగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook