TDP-Janasena Alliance: చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం బీజేపీతో జనసేన బంధంపై ప్రభావం చూపించినట్టే కన్పిస్తోంది. జైళ్లో చంద్రబాబుని పరామర్శించిన పవన్ కళ్యాణ్ పొత్తులపై విస్పష్ట ప్రకటన చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో బంధంపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌లో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. నారా లోకేశ్, బాలకృష్ణతో కలిసి చంద్రబాబుతో దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం బయటికొచ్చిన పవన్ కళ్యాణ్ లోకేష్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుపై నెలకొన్న సందిగ్దతకు తెరదించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మోదీతో సంబంధాన్ని తెంచేసుకునేందుకు సిద్ధమయ్యారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్డీయేలో ఉండటం వల్ల ఇప్పటి వరకూ ఆలోచించానన్నారు. ఇకపై ఆలోచించేది లేదని తెగేసి చెప్పారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ దౌర్జన్యాలు, అరాచకాలు మరో 20 ఏళ్లు కొనసాగుతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనను కూడా ఏపీలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఇన్నాళ్లూ కలిసి వెళ్తే బాగుంటుందని చెప్పేవాడినని...ఇప్పుడు నిర్ణయం తీసుకున్నానన్నారు. బీజేపీతో సంబంధం లేకుండానే టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పేశారు. బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదని..తన నిర్ణయం మాత్రం ఇదేనన్నారు.
గతంలో ఏపీకు అనుభవం కలిగిన నాయకుడు కావాలనే బీజేపీ-టీడీపీకు మద్దతిచ్చానన్నారు. ఆ తరువాత ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజ్ తీసుకున్న కారణంగా చంద్రబాబుతో విబేధించానన్నారు. వ్యక్తిగతంగా చంద్రబాబు సామర్ధ్యం తనకు తెలుసన్నారు.
చంద్రబాబు 2020 విజన్ అంటే అప్పట్లో ఎవరికీ అర్ధం కాలేదని, ఇప్పుడు అందరికీ అర్ధమౌతోందన్నారు. చంద్రబాబు శక్తి సామర్ధ్యాల్ని ఎన్నడూ తక్కువ అంచనా వేయలేదన్నారు. సైబరాబాద్ వంటి సిటీ నిర్మించిన చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఇది రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. ప్రశ్నిస్తే కేసులతో భయపెడుతున్నారని, వైసీపీ రాష్ట్రంలో అడ్జగోలుగా దోపిడీ చేస్తోందన్నారు. వైసీపీ దోపిడీ అడ్డుకోవాలంటే మూడు పార్టీలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఓ విజనరీ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Also read: Chandrababu Arrest: చంద్రబాబుకు మళ్లీ నిరాశ, బెయిల్‌పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook