గుంటూరులో అతిసార సమస్యపై ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే బంద్కు పిలుపునిచ్చి, ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రోజురోజుకూ అతిసార బాధితులు, మృతుల సంఖ్య పెరుగుతోందని.. ఇక్కడ తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని, అతిసార వ్యాధి బారిన పడి మృతి చెందిన బాధిత కుటుంబాలను పవన్ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
గుంటూరులో తాగునీరు కలుషితం కావడం వల్ల పదుల సంఖ్యలో జనం చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. నగరంలో అతిసారం ప్రబలినా.. మురుగునీరు సరఫరా అవుతోందని చెప్పినా మున్సిపల్ కమిషనర్ ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ప్రజలు ఆసుపత్రి పాలైనా ఇప్పటివరకూ ఏ రాజకీయపార్టీ ఈ సమస్యను తీవ్రంగా పరిగణించకపోవడం బాధగా ఉందన్నారు. పెద్దోళ్ల ఇళ్లల్లో ఇలాగే జరిగితే స్పందించకుండా ఉంటారా? సామాన్య ప్రజల ప్రాణాలు అంటే ప్రభుత్వానికి లెక్కలేదా? అని ప్రశ్నిస్తూ వైద్యసేవల్లో జాప్యం జరిగిందని పవన్ ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో ఈ అంశంపై ప్రజాప్రతినిధులు కూడా తూతూమంత్రంగానే చర్చించారని.. కొన్నేళ్లుగా గుంటూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించలేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికలు జరిగుంటే కార్పొరేటర్లతోనైనా ప్రజలు తమ గోడు చెప్పుకొనేవారని పవన్ అభిప్రాయపడ్డారు.