Sharmila: ఆంధ్రప్రదేశ్‌ నా పుట్టిల్లు.. ఏపీ కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తా: వైఎస్‌ షర్మిల

Sharmila Anantapur Tour: ఆంధ్రప్రదేశ్‌ తన పుట్టిల్లుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఏపీ కోసం ఎంతదాకైనా పోరాడుతానని, తన కుటుంబాన్ని చీల్చినా వెనుకాడనని స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల అనంతపురంలో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 28, 2024, 10:14 PM IST
Sharmila: ఆంధ్రప్రదేశ్‌ నా పుట్టిల్లు.. ఏపీ కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తా: వైఎస్‌ షర్మిల

AP is my Home Town: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్‌ షర్మిల రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటన చేపట్టిన ఆమె ఆదివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా అంటే తన తండ్రి వైఎస్సార్‌కి ప్రియమైన జిల్లా అని తెలిపారు. కరువు జిల్లాను బతికించుకోవాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గమని నమ్మి ఎన్నో నీటి ప్రాజెక్టులు ప్రారంభించారని వెల్లడించారు. రఘువీరా రెడ్డి తాత పేరు మీద తాగునీటి పథకం, ఉపాధి హామీ పథకం ఈ జిల్లా నుంచే ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

వైఎస్సార్ హయాంలో ఇక్కడ 22 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట వేసే వారని, ఇప్పుడు 3 లక్షల ఎకరాల్లో కూడా వేయడం లేదు షర్మిల తెలిపారు. పంట బీమా లేకపోవడంతో రైతులు సాహసం చేయడం లేదని చెప్పారు. దీనికి కారణం జగనన్న ప్రభుత్వమేనని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయంపై అన్ని రకాల సబ్సిడీలు ఉండేవని.. పరికరాలు కూడా సబ్సిడీ పై వచ్చేవని వెల్లడించారు. ఇప్పుడు రాయితీ అనే పథకమే లేదన్నారు. సబ్సిడీలు ఎత్తివేసిన జగనన్న ఇక్కడ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

'వైఎస్సార్ మరణించాక ఇక్కడి జిల్లా రైతుల కోసం రఘువీరా రెడ్డి చాలా తాపత్రయ పడ్డారని, ఇక్కడ రైతుల మేలు కోసం కేంద్రానికి లేఖ రాశాడని షర్మిల చెప్పారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అన్ని ఇక్కడే వచ్చేవని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో అంతా వృథా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా టీడీపీ, వైసీపీ అధికారంలో ఉండి ప్రాజెక్ట్ అనంత గురించి పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీకి బానిసలుగా మారి.. అనంత ప్రాజెక్టుకి తూట్లు పొడిచారని మండిపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే 6.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వచ్చేవని, నాలుగు జిల్లాలు సస్యశ్యామలయ్యేవని పేర్కొన్నారు. 90 శాతం పూర్తయిన హంద్రీనీవా పనుల్లో మిగిలిన 10 శాతం పనులు జగనన్న పూర్తి చేయలేకపోయాడని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. హంద్రీనీవా కోసం జల దీక్ష కూడా చేశాడని, 6 నెలల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.

ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశంపై షర్మిల స్పందిస్తూ.. 'ఇది నా పుట్టిల్లు. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతోంది. ఇక్కడి ప్రజల హక్కులు హరిస్తున్నారు. టీడీపీ, వైసీపీలు బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడటానికి ఈ వైఎస్సార్ బిడ్డ అడుగుపెట్టింది' అని తెలిపారు. బీజేపీకి బానిసలుగా మారిన  జగన్‌కి, బాబుకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టినందుకు ఓటు వేయాలా? అని నిలదీశారు.
 

ఒక్క డీఎస్సీ వేయలేదు
ఆంధ్ర ప్రజల కోసం కొట్లాడుతుంటే తనపై దాడులు చేస్తున్నారని షర్మిల తెలిపారు. ఎంత దాడులు చేసినా పర్వాలేదని, తన కుటుంబాన్ని చీల్చినా పర్వాలేదని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి త్యాగానికి అయినా సిద్ధమని ప్రకటించారు. జగనన్న ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, ఐదేళ్లలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, కనీసం ఒక డీఎస్సీ కూడా లేదని షర్మిల విమర్శించారు. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్‌ లేదబ్బా
 

Also Read: Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News