రాష్ట్ర రాజధాని అమరావతిలో నేటి నుంచి (ఏప్రిల్ 10) అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సు(హ్యాపీ సిటీస్ సమ్మిట్) జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. దాదాపు 27 దేశాల నుంచి ప్రతినిధులు హరవుతారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సదస్సును ప్రారంభిస్తారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేస్తారు. విజయవాడ-గుంటూరుల మధ్య, మంగళగిరికి సమీపంలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ హ్యాపీ సిటీస్ సమ్మిట్ జరగనుంది. ప్రజల్లో సంతోష స్థాయిలను పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో మేధోమధనం సాగించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందిన ప్రతి ఒక్కరు సదస్సుకు హాజరై ఆనంద అమరావతిని నిర్మించడానికి కృషి చేయాలని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ కోరారు. ప్రపంచంలోనే సంతోష నగరాల జాబితాలో ఫిన్‌ల్యాండ్ మొదటి స్థానంలో ఉండగా, భారత దేశం 133వ స్థానంలో ఉందని, అందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాపీనెస్ ఇండెక్స్ పెంచడంపై దృష్టి సారించారని ఆయన అన్నారు. అమరావతిని అత్యంత సంతోష నగరంగా తయారుచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు.
ఈ సదస్సుకు అమెరికా, ఇంగ్లండ్, స్పెయిన్, జపాన్, సింగపూర్, భూటాన్, ఫిన్లాండ్, యూఏఈ, కోస్టారికా, కొలంబియా, టాంజానియా, ఇజ్రాయెల్‌తో సహా 27 దేశాలకు చెందిన ప్రతినిధులతో మొత్తం వెయ్యిమందికిపైగా హాజరుకానున్నారు. దాల్‌బర్గ్, సీఐఐ, సింగపూర్‌కు చెందిన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సంస్థలు ఈ సదస్సులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. సీఎం చంద్రబాబు, సద్గురు జగ్గీ వాసుదేవ్ సంయుక్త నిర్వహణలో హ్యాపీనెస్ ఇండెక్స్ పై ప్రత్యేక చర్చ జరగనుంది.
ఈ సదస్సులో ప్రధానంగా 4 అంశాలపై చర్చించనున్నారు. ‘పౌరుడు-కేంద్రీకృత పాలన, నివాసయోగ్యమైన ఆవాసాలు, స్వచ్ఛమైన వాతావరణం, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ’ అనే అంశాలపై చర్చించనున్నారు. అలానే వర్క్‌షాపులు, నిపుణులతో ప్యానల్ చర్చలుంటాయి.
అమరావతిలో ఆనంద నగరాల సదస్సు