Son attacks mother in Guntur : గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం వెలుగుచూసింది. కన్నతల్లి పట్ల ఓ కొడుకు అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. వృద్దురాలు అని కూడా చూడకుండా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. చెంబుతో తలపై కొట్టి.. కాలితో తన్నాడు. కొద్దిరోజులుగా ఆస్తి కోసం తల్లిని అతను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిపై అతను దాడికి పాల్పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... తాడేపల్లి పరిధిలోని బ్రహ్మానందపురంలో నాగమణి అనే వృద్దురాలు నివసిస్తోంది. ఆమె భర్త వెంకటేశ్వరరావు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అప్పట్లో ప్రభుత్వం వీరికి ఇంటి స్థలం కేటాయించడంతో.. అందులోనే ఇంటిని నిర్మించుకున్నారు. వీరికి శేషు అనే కుమారుడు ఉన్నాడు.
వెంకటేశ్వరరావు బతికి ఉన్నప్పుడు శేషు తన భార్యతో కలిసి వేరే గ్రామంలో ఉండేవాడు. అక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగించాడు. వెంకటేశ్వరరావు చనిపోయాక.. భార్యతో కలిసి బ్రహ్మానందపురంలోని తల్లి ఇంటికి వచ్చేశాడు. దీంతో వృద్ధాప్యంలో కొడుకు తనకు తోడుగా ఉంటాడని తల్లి నాగమణి భావించింది. కానీ కొద్దిరోజులకే శేషు అసలు స్వరూపం బయటపడింది.
ఆస్తి కోసం ఆ తల్లిని వేధించడం మొదలుపెట్టాడు. ఆస్తి తన పేరిట రాయాలని నిత్యం ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. శుక్రవారం (ఫిబ్రవరి 18) తల్లితో మరోసారి గొడవపడ్డ శేషు.. చెంబుతో ఆమె తలపై దాడి చేశాడు. ఆమెను కాలితో తన్నాడు. నిలబడలేని స్థితిలో ఉన్న ఆ వృద్దురాలిపై అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. శేషు దాడిని స్థానికులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి స్థానిక సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు.
సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శేషును వారు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో శేషు దాడి వీడియోని చూసిన నెటిజన్లు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కొడుకును ఏం చేసిన పాపం లేదని మండిపడుతున్నారు.
Also Read: Kasturba Gandhi Memorial Trust: కస్తూర్బా గాంధీ ట్రస్ట్ నుంచి 14 మంది యువతుల ఎస్కేప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook