ఏపీ: డిసెంబర్ చివరిలోపు 6 వేల పోస్టులను భర్తీ!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీపీఎస్సీ

Last Updated : Oct 9, 2018, 07:56 AM IST
ఏపీ: డిసెంబర్ చివరిలోపు 6 వేల పోస్టులను భర్తీ!

నిరుద్యోగులకు తీపికబురు.. గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు త్వరలో జారీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ పి.ఉదయభాస్కర్ అన్నారు. సోమవారం కృష్ణాజిల్లాలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్‌-1, గ్రూప్‌- 2 సర్వీసులకు సంబంధించిన తుది సిలబస్‌ ఈ నాలుగైదు రోజుల్లో వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు.

ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేయాల్సిన పోస్టులకు రోస్టర్‌ పాయింట్లతో ఇండెంట్లు పంపించాల్సిందిగా ఆయా శాఖలను కోరామని, దీనిపై ఆయా శాఖల ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశామని వివరించారు. వారి నుంచి పోస్టుల వివరాలు రాగానే వారం-పదిరోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఉదయభాస్కర్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో కొన్ని యూనిట్ల నుంచి ఇండెంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.  

డీఎస్సీ సహా 18 వేల ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటిలో ఆరు వేల పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. అభ్యర్థుల వయోపరిమితి సడలింపుపై అభ్యర్థనలు వస్తున్నాయన్న ఆయన.. ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని, లేకుంటే సెప్టెంబర్ 30 తుది గడువే అమల్లోకి వస్తుందన్నారు.  

ఈ నెలాఖరులో రిక్రూట్‌మెంట్‌ కేలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. ఈ సారి దాదాపు 30కి పైగా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పిన ఆయన.. డిసెంబర్ చివరి లోపు 5 నుంచి 6 వేల పోస్టులను భర్తీ చేస్తామన్నారు.  

 

Trending News