తిరుపతి: సోమవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో సినీపరిశ్రమ మద్దతు ఉంటుందని అన్నారు. హోదా కోసం నిరసన తెలుపుతూ గత 40 ఏళ్లుగా పెంచుకున్న గడ్డాన్ని స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు. గతంలో మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని, తెలుగువారికి ఏ కష్టం వచ్చినా టాలీవుడ్ అండగా నిలబడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ, ఏపీలో ఎలాంటి విపత్తులు వచ్చినా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సహాయం అందిస్తుందన్నారు. హుద్ హుద్ తుఫాన్ సమయంలో బాధితుల కోసం రూ.12 కోట్ల విరాళాలను టాలీవుడ్ సేకరించిందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ విరాళాలకు సీఎం మరో రూ.12 కోట్లు కలిపి బాధితుల కోసం కాలనీ నిర్మించమని తమకే అప్పగించారని తెలియజేశారు. చిత్ర పరిశ్రమ అన్నింట్లో ముందుంటుందని, గతం మరచి తమపై ఆరోపణలు చేయడం తగదని వ్యాఖ్యానించారు. స్వామివారి దర్శనానంతరం పండితులు ఆశీర్వచనాలతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు.