CM YS Jagan Mohan Reddy: విశాఖలో ఇనార్బిట్ మాల్‌కు సీఎం జగన్ శంకుస్థాపన.. 8 వేల మందికి ఉద్యోగాలు

Inorbit Mall in Visakhapatnam: విశాఖ నగరం రూపురేఖలు మారుతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. మాల్ నిర్మాణంతో 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 1, 2023, 03:39 PM IST
CM YS Jagan Mohan Reddy: విశాఖలో ఇనార్బిట్ మాల్‌కు సీఎం జగన్ శంకుస్థాపన.. 8 వేల మందికి ఉద్యోగాలు

Inorbit Mall in Visakhapatnam: విశాఖ‌ నగరంలోని కైలాసపురం వద్ద దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో 17 ఎకరాల్లో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం జరగనుంది. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. విశాఖ అభివృద్ధికి మరింత దోహదం చేస్తూ.. విశాఖపట్టణంలో ఆణిముత్యంగా నిల్చిపోయే మంచి ప్రాజెక్టుకు శంకుస్ధాపనతో శ్రీకారం చుట్టామని తెలిపారు. 17 ఎకరాల స్ధలానికిగాను.. 12–13 ఎకరాల పెద్ద విస్తీర్ణంలో మాల్‌ రావడం అన్నది కొన్ని చోట్లే ఉంటుందన్నారు. ఇదే రహేజా గ్రూపు హైదరాబాద్‌లో  ఇనార్బిట్‌ మాల్‌ను 7–8 ఎకరాల్లోనే కడితే మనం 12–13 ఎకరాల విస్తీర్ణంతో పెద్ద మాల్‌కు ఇక్కడ శంకుస్ధాపన చేశామని అన్నారు.  

"ఈ రోజు ఇక్కడ కడుతున్న మాల్‌ నిర్మాణం ద్వారా విశాఖపట్నం రూపురేఖలు మారడమే కాకుండా.. దక్షిణ భారతదేశంలోనే పెద్ద మాల్‌ కానుంది. రూ.600 కోట్ల పెట్టుబడితో ఇంత పెద్ద విస్తీర్ణంలో మాల్‌ నిర్మాణంతో 8 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. 12 నుంచి 13 ఎకరాల్లో మాల్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన భూమిలో రాబోయే రోజుల్లో రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ రెండున్నర లక్షల ఎస్‌ఎప్‌టీతో ఐటీ స్పేస్‌ కూడా రాబోతుంది. 

అంతర్జాతీయ స్ధాయిలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ను కూడా నిర్మించనున్నారు. వీటన్నింటి ద్వారా ఇంకా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. 2.50 లక్షల ఎస్‌ఎఫ్‌టితో ఐటీ స్పేస్‌ రావడం వల్ల మరో 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నాయి. ఇవన్నీ రాబోయో రోజుల్లో విశాఖపట్టణాన్ని  అంతర్జాతీయ స్ధాయిలో నిలబెట్టే కార్యక్రమాలు. 

ఇంతకముందు వచ్చినప్పుడు ఆదానీ గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డేటాపార్కు, ఐటీ స్పేస్‌కు శంకుస్ధాపన చేసుకున్నాం. అదే రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులకు కూడా శంకుస్ధాపన చేశాం. అంతకన్నా ముందు శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే విధంగా మూలపేటలో పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేసుకున్నాం. ఇవన్నీ ఉత్తరాంధ్రా అభివృద్ధి రూపురేఖలను మార్చే గొప్ప అడుగులు. ఇనార్బిట్‌ మాల్‌ కూడా అలాంటిదే. 

ఇవి కాకుండా రహేజా గ్రూపు దేశంలో పలుచోట్ల ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు కట్టారు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో రాజ్‌విలాస్‌ తరహాలో సూపర్‌ లగ్జరీ  ఫైవ్‌స్టార్‌ ప్లస్, సెవెన్‌ స్టార్‌ హోటల్‌ కట్టబోతున్నారు. ఇప్పటికే ఒబెరాయ్, మేపెయిర్‌ హోటల్స్‌ గ్రూపు వాళ్లు కూడా కడుతున్నారు. ఆ తరహాలో రహేజా గ్రూపు కూడా సెవెన్‌ స్టార్‌ లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణంలో మూడో గ్రూపు కానుంది. ఇవన్నీ విశాఖలో గొప్ప ప్రాజెక్టులుగా నిలుస్తాయి.." అని సీఎం జగన్ అన్నారు.

అదే విధంగా హిందూపూర్‌లో కూడా 350 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, టెక్ట్స్‌టైల్స్‌కు సంబంధించిన పార్కు రాబోతుందని ముఖ్యమంత్రి తెలిపారు. దానివల్ల మరో 15వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు కూడా అడుగులు ముందుకు వేశామని.. యుద్ధ ప్రాతిపదికన అది కూడా టేకప్‌ చేస్తామన్నారు. దానికి కూడా ప్రభుత్వం సపోర్టు చేస్తుందని పేర్కొన్నారు.  

Also Read: Gas Cylinder Price Today: గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధర  

Also Read: Amrit Bharat Stations: రాష్ట్రంలో అమృత్ భారత్ స్కీమ్‌ కింద ఎంపికైన స్టేషన్లు ఇవే.. ఈ నెల 6న ప్రధాని శంకుస్థాపన   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News