CM Jagan: డీఎస్సీ 98 అభ్యర్థులకు త్వరగా పోస్టింగ్ ఇవ్వండి.. సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review On School Education Department: వచ్చే విద్యా సంవత్సరం విద్యాకానుక కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 07:18 AM IST
  • విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
  • సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలని ఆదేశం
  • ఇక నుంచి విద్యార్థులకు మూడు రోజులు నుంచి రాగిమాల్ట్‌
CM Jagan: డీఎస్సీ 98 అభ్యర్థులకు త్వరగా పోస్టింగ్ ఇవ్వండి.. సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review On School Education Department: పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ పూర్తయిందని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. ట్యాబుల మెయింటైనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్‌ సెంటర్‌ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్యాబుల్లో ఎలాంటి సమస్య ఉన్నా వారం రోజుల్లో మరమ్మతు చేసి లేదా కొత్త ట్యాబును విద్యార్థికి అందించాలని సీఎం ఆదేశించారు. ట్యాబుల వాడకం, పాఠాలను నేర్చుకుంటున్న తీరు తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అధికారులు వివరించారు. డేటా అనలిటిక్స్‌ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన ఉండాలని.. దీనికి అనుగుణంగా హెడ్‌ మాస్టర్‌, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను అధికారులు చెప్పారు. 

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటు కావాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని చెప్పారు. ఈ డిజిటల్‌ స్క్రీన్లు వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలన్నారు. వీటిని ఉపయోగించుకుని ఎలా బోధన చేయాలో టీచర్లకు చక్కటి అవగాహన, శిక్షణ కల్పించాలని సూచించారు. పిల్లలు అందరివద్దా డిక్షనరీలు ఉన్నాయా..? లేవా..? మరోసారి పరిశీలన చేయాలని చెప్పారు.

ఈ సందర్భంగా డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 'వచ్చే విద్యా సంవత్సరం విద్యాకానుక కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యాకానుక అందాలి. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలి. ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే టీచర్లు ఉండేలా చూసుకోవాలి. సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుంది. విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగుపడుతుంది..' అని సీఎం జగన్ అన్నారు. 

గోరుముద్ద నాణ్యతను నిరంతర పరిశీలన చేయాలని సూచించారు ముఖ్యమంత్రి. అన్ని స్కూళ్లు, అంగన్ వాడీలకు సార్టెక్స్‌ ఫోర్టిఫైడ్‌ బియ్యం మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీవద్దని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇస్తున్న ఆహారానికి అదనంగా స్కూలు పిల్లలకు బెల్లంతో రాగి మాల్ట్‌ ఇవ్వాలని చెప్పారు. వారానికి మూడు రోజులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాగిమాల్ట్‌ సరఫరా చేయాలన్నారు. అదేవిధంగా నాడు –నేడు రెండో దశ పనులను సీఎం జగన్ సమీక్షించారు.

Also Read: IND Vs Sri Lanka: ఆ ఒక్క షాట్ ఆడకపోయింటే భారత్‌దే గెలుపు.. అక్షర్, సూర్యకుమార్ పోరాటం వృథా  

Also Read: ICC T20 Rankings: 40 స్థానాలను ఎగబాకిన దీపక్‌ హుడా.. టాప్ 10లో ఒక్క ఇండియన్ ప్లేయర్ లేడు!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News