Chicken Price All Time Record: తెలుగు రాష్ట్రాల్లో మాంసం ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ.300 మార్క్‌ని చేరింది. ఏపీలోని విశాఖపట్నంలో కిలో చికెన్ ధర ఏకంగా రూ.312కి చేరి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. దీంతో చికెన్ కొనేందుకు సామాన్యులు వెనుకాడుతున్నారు. ఈ నెల 1న రూ.228గా ఉన్న కిలో చికెన్ ధర.. కేవలం 11 రోజుల్లోనే రూ.84 మేర పెరగడం గమనార్హం.
ఈ ఏడాది ప్రారంభంలో కిలో చికెన్ ధర రూ.214 ఉండగా.. మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.280కి చేరింది. ఆ తర్వాత మళ్లీ క్రమంగా తగ్గుతూ మే 1 నాటికి రూ.228కి చేరింది. గతంలో కోవిడ్ సెకండ్ వేవ్ సందర్భంగా చికెన్ ధరలు అమాంతం దిగొచ్చిన సంగతి తెలిసిందే. కిలో చికెన్ రూ.80 కన్నా తక్కువకే లభించింది. సెకండ్ వేవ్ తర్వాత చికెన్ ధరలు మళ్లీ పెరుగుతూ వచ్చాయి.
ప్రస్తుత వేసవి సీజన్‌లో డిమాండ్‌కు తగినంత సప్లై లేకపోవడంతోనే చికెన్ ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా వేసవిలో కోళ్లు తగినంత బరువు పెరిగేందుకు ఎక్కువ రోజులు పడుతుందని... అందుకే సప్లై తగ్గిపోయిందని అంటున్నారు. కోళ్లకు దానాగా వేసే తవుడు, మొక్కజొన్న, సోయ ధరలు పెరగడం కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణమంటున్నారు.
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. పాల దగ్గరి నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ వరకు అన్ని ధరలు పెరిగాయి. తాజాగా చికెన్ ధరలు కూడా కొండెక్కడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాంసానికి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ధరల పెరుగుదలపై సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook