Chalo Vijayawada LIVE Updates*: 7వ తేదీ నుండి ఉద్యోగుల సమ్మె..? ఏం జరగనుంది..??

Chalo Vijayawada, AP PRC Issue, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి పిలుపుతో... తలపెట్టిన చలో విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలి వచ్చారు. ఏపీ నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులతో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 07:33 PM IST
  • చలో విజయవాడలో ఉద్రిక్తంగా మారుతోన్న పరిస్థితులు
  • ఏపీలో పీఆర్సీ జీఓలను వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
  • అన్ని జిల్లాల నుంచి విజయవాడకు చేరుకున్న ఉద్యోగులు
  • ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్న పోలీసులు
Chalo Vijayawada LIVE Updates*: 7వ తేదీ నుండి ఉద్యోగుల సమ్మె..? ఏం జరగనుంది..??

తెలంగాణలో మాదిరిగా డీఏ ఇవ్వలేదు.. ఐఆర్ ఇచ్చాం : సీఎస్ సమీర్ శర్మ

కొవిడ్ వల్ల ఏపీలో అనేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని ఏపీ సీఎస్ సమీర్ శర్మ పేర్కొన్నారు. ఆందోళనలు, ధర్నాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. చర్చలు జరిపితేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనన్నారు. తెలంగాణలో మాదిరిగా ఉద్యోగులకు డీఏ ఇస్తే ఏపీ ప్రభుత్వానికి పదివేల కోట్ల రూపాయలు మిగిలేవని.. తాము అలా చేయలేదన్నారు. ఏపీ ప్రభుత్వం డీఏ ఇవ్వలేదని.. ఐఆర్ ఇచ్చిందని సీఎస్ తెలిపారు. అసలు ఉద్యోగులకు వేతనం ఎక్కడ తగ్గిందో చెప్తేనే కదా.. తమకు తెలిసేది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

చలో విజయవాడను విజయవంతం చేసుకున్నాం

చలో విజయవాడ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకున్నాం అంటున్నారు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున వస్తారని ప్రభుత్వవర్గాలు కూడా ఊహించలేదన్నారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కొత్త పీర్సీ జీవోలను .. 13 లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. 

ప్రభుత్వ ఉద్యోగులంతా చెప్పిన సమయానికి.. చెప్పిన చోటుకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ప్రభుత్వం ఆలోచనలో పడిందంటున్నారు. నోటీసులను లెక్కచేయకుండా.. ఆంక్షలను దాటుకుంటూ.. చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.  

ఉద్యోగులంతా పోలీసుల అడ్డగింపులను ఎదుర్కొంటూ విజయవాడ  బీఆర్‌టీఎస్‌ రోడ్డులో కదన రంగం తొక్కారని... ఎలా వచ్చారో ఏమోగానీ పోటెత్తిన సంద్రంలా ఒక్కసారి వేలాది మంది దూసుకొచ్చేశారన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఇక ముందుస్తుగా చలో విజయవాడకు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోకపోవడంతో స్థానికుల సాయంతో ఉద్యోగులు దాహాన్ని తీర్చుకున్నారన్నారు.

vijayawada

ఎక్కువ ఆశిస్తున్నారు అందుకే ఇలా : సజ్జల

ఉద్యోగులతో చర్చలకు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగుల్ని చర్చలకు పిలుస్తున్నా కూడా వాళ్లే రావట్లేదని తెలిపారు. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు. అయినా కూడా ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మంచి ప్యాకేజే ఇచ్చామని చెప్పుకొచ్చారు సజ్జల. పీఆర్సీ నుండి ఎక్కువ ఆశించడంతోనే ఉద్యోగుల్లో అసంతృప్తి తలెత్తిందని ఆయన అన్నారు.

పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లడం దారుణం : సోము వీర్రాజు

చలో విజయవాడ కార్యక్రమానికి తరలి వస్తోన్న ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని అరెస్ట్‌ చేయడంపై బీజేపీ స్పందించింది. ఉద్యోగులు పొలిటికల్ లీడర్లు కాదని.. వారిని అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లడం దారుణమని  బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రభుత్వానికి సహాయ సహకాలు అందించే ఉద్యోగులపై అలా ప్రవర్తించడం సరికాదన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడన్నారు.

 

జ‌గ‌న్‌ నియంతృత్వ పాలనకు చెంపపెట్టు : సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌

చలో విజ‌య‌వాడ కార్యక్రమం జయప్రదం కావడంపై సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌ స్పందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం ఏపీ సీఎం జ‌గ‌న్‌ నియంతృత్వ పాలనకు చెంపపెట్టులాంటిదంటూ ఆయన పేర్కొన్నారు. 

లేటెస్ట్ అప్డేట్స్.. 

సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి సీఎస్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులు 
ఉద్యోగుల 'చలో విజయవాడ'పై ఉన్నాతాధికారులతో చర్చించనున్న సీఎం జగన్ 
సాయంత్రం 6 గంటలకు మీడియాతో మాట్లాడనున్న సీఎస్ సమీర్ శర్మ 

కార్మిక సంఘాల మద్దతు

చలో విజయవాడకు తరలి వచ్చిన ఉపాధ్యాయులను, ఉద్యోగుల్ని అరెస్ట్ చేయడాన్ని పలు కార్మిక సంఘాలు తప్పుబట్టాయి . 

సీఎం జగన్‌తో సజ్జల, సీఎస్‌ల భేటీ

పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నా కూడా చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డితో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో సజ్జలతో పాటు సీఎస్ సమీర్ శర్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. "చలో విజయవాడ" గురించే సీఎం జగన్‌ వారితో చర్చించారని తెలుస్తోంది.

vijayawada

అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?: నారా లోకేశ్ 

చలో విజయవాడ తలపెట్టిన ఉపాధ్యాయులను, ఉద్యోగుల్ని అరెస్ట్‌ చేయడం, నిర్బంధించడంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు.. లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులపై అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు. శాంతియుతంగా ఉద్యోగులు నిరసన తెలిపితే నేరం ఎలా అవుతుందని ఆయన నిలదీశారు.

 

ఉద్యోగులు ఏమైనా టెర్రరిస్ట్‌లా? : చంద్రబాబు

తమ హక్కుల కోసం పోరాడుతోన్న ఉద్యోగుల్ని ఎలా అరెస్ట్ చేస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఉద్యోగుల నిరసనలపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును ఆయన తప్పుబట్టారు. గవర్నమెంట్‌లో భాగమైనటువంటి ఉద్యోగుల్ని టెర్రరిస్ట్‌ల్లా అరెస్ట్‌ చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

vijayawada

7వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్న సచివాలయ ఉద్యోగులు

విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్ అంతా కూడా ఉద్యోగులతో నిండిపోయింది. ఎటు చూసినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులతో విజయవాడ రోడ్లన్నీ కిక్కిరిపోతున్నాయి. ఇక ఐదో తేదీ నుండి పెన్‌ డౌన్ చేపడతామంటూ ఉద్యోగ, ఉపాధ్యా సంఘాల నేతలు స్పష్టం చేశారు. అలాగే ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులంతా తమతో పాటు సమ్మెకు దిగుతారన్నారు.

 

ఉద్యోగులే పర్మినెంట్‌గా ఉంటారు : ఎంపీ రఘురామ కృష్ణంరాజు

చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్‌ అయిందంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఉద్యోగులే పర్మినెంట్‌గా ఉంటారని.. ప్రజాప్రతినిధులంతా ఐదు సంవత్సరాలే ఉంటారంటూ ఆయన అన్నారు. సీఎం జగన్ అభినవ రోమ్‌చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్నాంటూ  ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. 

చర్చలకు ఎప్పుడూ సిద్ధమే : మంత్రి బొత్స

ఏపీలో పీఆర్సీ జరుగుతోన్న రగడపై  మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కరోనా నిబంధనలు ఉండడం వల్లే "చలో విజయవాడ" కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు. అయితే బాల్‌.. ఉద్యోగ సంఘాల కోర్ట్‌లోనే ఉందంటూ బొత్స అన్నారు. ఏపీ సర్కార్ చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉందని మంత్రి పేర్కొన్నారు. 
 

ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి సహయ నిరాకరణ 

ఉద్యోగ సంఘాల వెనుక ఎవరూ లేరంటూ పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు అన్నారు. మా వెనుక కేవలం లక్షలాది మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారన్నారు. ఇక పోలీసుల వెనుకా తామే ఉన్నామంటూ బొప్పరాజు చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి సహయ నిరాకరణ చేపడతామంటూ బొప్పరాజు పేర్కొన్నారు. ఏడో నుంచి సమ్మె నిర్వహిస్తామన్నారు.

AP PRC

మహిళా ఉద్యోగులు కనకదుర్గలై కదిలారు..

పోలీసు నిర్బంధాలు వారిని ఆపలేకపోయాయి... బారికేడ్లు అడ్డుకోలేక పోయాయంటూ టీడీపీ ఉద్యోగుల నిరసనకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసింది. ప్రభుత్వ అణచివేతను ఛేదించుకుని ఉప్పెనలా ఉద్యోగులు విజయవాడ రోడ్లపై పోటెత్తారంటూ టీడీపీ పేర్కొంది. మహిళా ఉద్యోగులు కనకదుర్గలై కదిలారంటూ ట్వీట్ చేసింది.

 

టీడీపీ మద్దతు ఉంటుంది..

తమ హక్కుల కోసం పోరాడుతోన్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడలో భారీ పోలీసుల బందోబస్తు మధ్యే రోడ్డెక్కారంటూ టీడీపీ పేర్కొంది. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసనకు తెలుగుదేశం పార్టీ, పార్టీ అనుబంధ సంఘాలన్నీ కూడా పూర్తి మద్దతును అందిస్తున్నాయంటూ టీడీపీ పేర్కొంది.

సజ్జల రామకృష్ణారెడ్డి కాదు.. సీఎం సమాధానం ఇవ్వాలి..

చలో విజయవాడలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తమ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం అవసరం లేదన్నారు. తమ డిమాండ్లను సీఎం జగన్‌కు, మంత్రులకు మాత్రమే చెప్తామన్నారు. తమ సమస్యలపై వారితోనే మాట్లాడతామన్నారు. తమకు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు.. సీఎం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

చేతులెత్తేస్తోన్న పోలీసులు..
చలో విజయవాడకు ఎవరూ ఊహించని రీతిలో ఉద్యోగులు తరలిరావడంతో పోలీసులు కూడా చేతులేత్తేసే పరిస్థితి ఏర్పడింది. విజయవాడకు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు నిర్బంధాలు చేపట్టినా కూడా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు.

హౌస్ అరెస్టులు చేయలేదు.. అనుమతి లేని సభలకు వెళ్లొద్దన్నాం..

చలో విజయవాడపై ఏపీ హోంమంత్రి సుచరిత కామెంట్స్ చేశారు. చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్దమని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగులు సహకరించాలని సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు. దీనిపై కమిటీ కూడా వేశామన్నారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి పేర్కొన్నారు. హౌస్ అరెస్టులు చేయలేదన్నారు. అనుమతి లేని సభలకు వెళ్ల వద్దని చెప్పామన్నారు. కరోనాతో ఇప్పటికే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నాయని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.

AP PRC Issue

ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లింపు

చలో విజయవాడ కార్యక్రమంతో బెజవాడ అంతా కిక్కిరిసిపోతోంది. బీఆర్‌టీఎస్‌ రోడ్డు పొడవునా చాలా కిలో మీటర్ల వరకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బెజవాడలోని రోడ్లన్నీ మూసుకుపోవడంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.

సభను నిర్వహించకండి..

చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా.. విజయవాడలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డు వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఉద్యోగులు నిర్ణయించారు. కాగా పోలీసులు మాత్రం ఈ సభకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు రోడ్డుపైనే ట్రాలీ ఆటోల్లో నుంచి మాట్లాడుతున్నారు.

రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి..

భారీ సంఖ్యలో విజయవాడకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలిరావడంతో విజయవాడ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, పెన్షనర్స్‌, ఇతర కార్మికులు కూడా పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకున్నారు. బెజవాడ రోడ్లన్నీ కదనరంగంగా మారాయి.

ఉప్పెనలా..

చలో విజయవాడకు ఉప్పెనలా ఉద్యోగులు తరలివచ్చారు. విజయవాడ రోడ్లపై కదం తొక్కుతున్నారు. బెజవాడ మొత్తం ఉద్యోగుల నినాదాలతో, భారీ ర్యాలీలతో దద్దరిల్లుతోంది.

సాధించి.. సాధించి తీరుతాం..

విజయవాడలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డు వద్ద సాధించి.. సాధించి తీరుతాం అంటూ ఉద్యోగులు చేస్తోన్న నినాదాలు మిన్నంటుతున్నాయి. దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

వియ్ వాంట్ జస్టీస్..

చలో విజయవాడ కార్యక్రమం క్షణక్షణానికి మరింత ఆందోళనకంగా మారుతోంది.  విజయవాడ ఎన్జీఓ హోం సర్కిల్ నుంచి ప్రారంభమైన ఉద్యోగుల ర్యాలీ బీఆర్‌టీఎస్‌ రోడ్డు వైపు చేరుకుంది. వియ్ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలతో ప్రస్తుతం బీఆర్‌టీఎస్‌ రోడ్డు మారుమోగిపోతోంది.

సీసీ కెమెరాల్లో అంతా మానిటరింగ్..

చలో విజయవాడ కార్యక్రమంలో జరుగుతోన్న ప్రతి సీన్‌పై పోలీసులు నిఘా ఉంచారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. 

హోరెత్తుతోన్న నినాదాలు

విజయవాడలోని బీఆర్టీఎస్ వద్దకు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ప్రభంజనంలాగా వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేరకున్నారు. ఉద్యోగుల నినాదాలు హోరెత్తుతున్నాయి.

AP PRC Issue

ఉద్రిక్త వాతావారణం

విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. వేలాది మంది ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్‌పైకి దూసుకొచ్చారు. పీఆర్సీ సాధన సమితికి సంబంధించిన ఎర్ర జెండాలు చేతితో పట్టుకుని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మోగిస్తున్నారు.

AP PRC Issue

గుడివాడలో పోలీసుల అదుపులోకి..

కృష్ణా జిల్లా గుడివాడ నుంచి చలో విజయవాడకు బయలుదేరిన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల కార్యకర్తలను, నాయకులను పోలీసులు అదుపులోకి  తీసుకుని గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం తగదంటూ గుడివాడ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నారు. ఇక చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తోన్న ఉద్యోగులను  పోలీసులు రైల్వే స్టేషన్‌లు, బస్‌ స్టాప్‌ల వద్దే అడ్డుకుంటున్నారు. 

AP PRC Issue

ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇదేనా?

ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ రోడ్డుపైకి ఈడ్చిందంటూ ఫైర్ అవుతోన్న ఉద్యోగులు. సీఎం జగన్ పట్టుదలకు వెళ్తే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.

AP PRC Issue

విజయవాడకు భారీగా చేరిన ఉద్యోగులు 
మారువేషాల్లో రెండు మూడు రోజుల ముందే విజయవాడ చేరుకున్నారు ఉద్యోగులు. ఎర్రజెండాతో బీఆర్టీఎస్ రోడ్డు దగ్గరకి చేరుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. 
ఎన్జీఓ భవన్ నుంచి ఉద్యోగులు, టీచర్ల భారీ ర్యాలీగా వస్తోన్నారు.

chalo vijayawada

బీఆర్‌టీఎస్‌ రోడ్‌లో భారీ ర్యాలీ

విజయవాడలోని ఎన్జీఓ భవన్‌ నుంచి అలంకార్‌ థియేటర్‌ సర్కిల్ మీదుగా బీఆర్‌టీఎస్‌ రోడ్‌కు భారీ ర్యాలీగా చేరుకున్న ఉద్యోగులు

vijayawada

బెజవాడ టెన్షన్

పీఆర్సీ జోవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేదాకా ఉద్యమం కొనసాగుతోందంటోన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నేతలు

AP PRC Issue

చెక్ పోస్టులు ఏర్పాటు

కృష్ణాజిల్లాఅవనిగడ్డ నియోజవర్గంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. ఈ తనిఖీల్లో అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా,  అవనిగడ్డ, చల్లపల్లి సీఐలు, నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎస్సైలు పాల్గొన్నారు. 

AP PRC Issue

అలాగే చలో విజయవాడకు అనుమతి లేదంటూ పలుచోట్ల చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేశారు పోలీసులు. (Police) ఉద్యోగులకు సంబంధించిన వాహనాల్ని వెనక్కి పంపినా కూడా తప్పించుకుని విజయవాడకు వచ్చారు.

అయితే పోలీసులు అడ్డుకోవడంతో కొందరు ఉద్యోగులు (Employees) మారు వేషాల్లోనూ విజయవాడకు వచ్చారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తులుగా, కూలీలుగా మారువేషాలు వేసుకుని విజయవాడకు చేరుకున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. 

AP PRC Issue

పెళ్లి బస్సు ముసుగులో..

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ శివారులో చలో విజయవాడలో భాగంగా నంద్యాల రోడ్‌లో  వాహనాల తనిఖీ చేపట్టి ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే వీరంతా కూడా వినూత్నంగా పెళ్లి బస్సు లో రావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఉపాధ్యాయులంతా  అనంతపురం కర్నూలు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులుగా గుర్తించారు.

AP PRC Issue

Chalo Vijayawada Latest Updates: చలో విజయవాడలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఏపీలో పీఆర్సీ జీఓలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన చలో విజయవాడ (Chalo Vijayawada) కార్యక్రమంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా ఏపీలోని (AP) అన్ని జిల్లాల నుంచి ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ అదుపులోకి తీసుకున్నా కూడా చాలా మంది విజయవాడకు వచ్చేశారు. ఇక పలుచోట్ల ఉద్యోగ సంఘాల నేతల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీస్ Also Read: Chalo Vijayawada: విజయవాడలో హైటెన్షన్.. అటు పోలీసుల అరెస్టులు, ఇటు ఉద్యోగుల దూకుడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News