హైదరాబాద్: పోలవరం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గతంలో అభ్యంతరాలు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడెందుకు మాట మార్చుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. పదవీ కాంక్షతోనే అప్పుడు ప్రాజెక్టులను వ్యతిరేకించారా అని నిలదీసిన లక్ష్మణ్.. తెలంగాణ సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా భద్రాచలం ముంపుపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి వైఖరిని అవలంభించదల్చుకుందో చెప్పాలని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా చూసుకోవాలని.. అందరికీ తాగు నీరు, సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరే క్రమంలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో ఇతర పార్టీల నేతల చేరికపై లక్ష్మణ్ స్పందిస్తూ.. బీజేపీలో చేరికలు ఓ నిరంతర ప్రక్రియలా కొనసాగుతుందని, ఇక వాటికి అంతం లేదని అన్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్కు ముందుంది ముసళ్ల పండగ అంటూ అధికార పార్టీని హెచ్చరించారు.