పెట్రోల్ ధరల్లో రూ.2.50 తగ్గించినట్టు స్పష్టంచేసిన కేంద్రం.. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మొత్తాన్ని తగ్గిస్తే, పేదోడిపై భారాన్ని తగ్గించొచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఇచ్చిన ఈ పిలుపు మేరకు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ చత్తీస్ఘడ్, ఉత్తర్ ప్రదేశ్, త్రిపుర, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అస్సాం, ఉత్తరాఖండ్, గోవా వంటి పలు రాష్ట్రాలు వెంటనే స్పందించాయి. తమ రాష్ట్రంలోనూ అదనంగా మరో రూ.2.50 తగ్గిస్తున్నట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఓ అధికారిక ప్రకటన విడుదల చేశాయి.
ఇదిలావుంటే, కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు ఒడిషాలోని నవీన్ పట్నాయక్ సర్కార్ సైతం ఇంకొంత తగ్గించాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన అనంతరం భువనేశ్వర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిషా సర్కార్‌కి ఈ విజ్ఞప్తి చేశారు.
ఇదిలావుంటే, కేంద్రం ఇచ్చిన పిలుపుపై కడపటి వార్తలు అందే సమయానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకా ఎటువంటి స్పందన వెలువడలేదు.