ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలుగుదేశం హిందూపురం ఎమ్మెల్యే, తన సోదరుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తనకెంతో బాధకలిగించాయని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ రోజు కొప్పళ జిల్లా గంగావతి ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలకృష్ణ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. రాజ్యాంగపరమైన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని అసభ్యపదజాలంతో దూషించడం సరికాదన్నారు. కర్ణాటక ఓటర్లు తెలివైన వారని, ఎవరు ఓటేస్తే అభివృద్ధి జరుగతుందో వారికి తెలుసని.. అది బీజేపీతోనే సాధ్యమని అన్నారు.
చంద్రబాబు మిత్రధర్మం పాటించలేదు
నాలుగేళ్లుగా చంద్రబాబు మిత్రధర్మం పాటించలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఏదో జరగబోతుందని చంద్రబాబుకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 2019 ఎన్నికల్లో సానుభూతి పనిచేయదని చెప్పేందుకే అలిపిరి ఘటనను ప్రస్తావించానని పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కించపరిచిన బాలకృష్ణపై కేసులు పెట్టకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని ప్రకటించినా తమ కార్యకర్తలు ఆమోదిస్తారని సోము వీర్రాజు అన్నారు.