నిఘా నీడలో విశాఖ మన్యం.. నేడు, రేపు అరకు బంద్

నిఘా నీడలో విశాఖ మన్యం.. నేడు, రేపు అరకు బంద్

Last Updated : Sep 24, 2018, 05:44 PM IST
నిఘా నీడలో విశాఖ మన్యం.. నేడు, రేపు అరకు బంద్

మావోయిస్టుల చేతిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ దారుణ హత్యలకు గురయ్యారు. వీరి హత్యలను నిరసిస్తూ రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు సోమ, మంగళవారాలు అరకు బంద్‌కు పిలుపునిచ్చాయి. అరకులో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

అరకు బంద్ నేపథ్యంలో మన్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మన్యంలోని అన్ని ప్రాంతాలను గ్రేహౌండ్స్‌ దళాలు జల్లెడ పడుతున్నాయి.

ఆదివారం ఎమ్మెల్యే మృతితో అభిమానులు ఆందోళనకు లోనయ్యారు. రెండు పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు. అల్లర్లు చెలరేగకుండా నివారించడంలో విఫలమయ్యారంటూ డుంబ్రిగూడ ఎస్‌ఐను డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ కోసం విశాఖ డీసీపీ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేశారు.

కాగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మృతదేహాలకు పోస్టు మార్టం పూర్తయింది. కిడారి మృతదేహాన్ని పాడేరుకు, సోమ మృతదేహాన్ని భట్టివలసకు తరలించారు. వీరికి ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా ఆకాశ మార్గంలో నేతలను తరలించనున్నారు.

Trending News