ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి సారించింది. ఆధిక్యాన్ని నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుంటే..సత్తా చాటాలని బీజేపీ-జనసేన, టీడీపీలు ఆలోచిస్తున్నాయి.
ఏపీ తిరుపతి లోక్‌సభ ( Tirupati lok sabha bypoll ) స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ ( ycp mp durga prasad ) మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇటీవల తెలంగాణలోని దుబ్బాక ( Dubbaka )లో జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి ఆ స్థానాన్ని చేజిక్కించుకున్న బీజేపీ ( Bjp )..తిరుపతిలో అదే జరుగుతుందని ఆశిస్తోంది. అటు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తిరుపతి స్థానంలో గెలిచి సత్తా చాటాలని ఆలోచిస్తోంది. ఈ నేపధ్యంలో తిరుపతి ( Tirupati )లో మరోసారి గెలవడం ద్వారా ఆధిక్యం చాటుకోవాలనేది వైసీపీ ఆలోచనగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( ysr congress party ) చిత్తూరు నుంచే ప్రారంభించాలనే నిర్ణయం వెనుక తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఉంది. చిత్తూరులో ఈ నెల 25 న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ముగిశాక..27వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని తిరుపతిలోనే ఏర్పాటు చేశారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు, మండలాల బాధ్యతల్ని ప్రాంతాలవారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పగించాలని వైసీపీ అదిష్టానం యోచిస్తోంది.
తిరుపతి ఉప ఎన్నిక కోసం వైసీపీ అభ్యర్ధిని మారుస్తోంది. చనిపోయిన ఎంపి దుర్గా ప్రసాద్ కుటుంబం నుంచి కాకుండా డాక్టర్ గురుమూర్తిని రంగంలో దింపేందుకు ప్రయత్నిస్తోంది. దుర్గా ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ( Tdp ) ఇప్పటికే తమ అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని ప్రకటించగా..బీజేపీ-జనసేన పార్టీలు ( Bjp-janasena )ఎవరిని బరిలో దింపుతాయనేది ఇంకా తేలలేదు.