చంద్రబాబు బతుకంతా యూ టర్న్ లే: ఏపీ మంత్రి పేర్ని నాని

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై ఏపీ మంత్రి పేర్ని నాని(Perni Nani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన శైలికి తగినట్టుగా తన వ్యాఖ్యలకు తానే విరుద్దంగా మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.

Last Updated : Nov 22, 2019, 08:16 PM IST
చంద్రబాబు బతుకంతా యూ టర్న్ లే: ఏపీ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై ఏపీ మంత్రి పేర్ని నాని(Perni Nani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన శైలికి తగినట్టుగా తన వ్యాఖ్యలకు తానే విరుద్దంగా మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం(English Medium) తామే తెచ్చాము అంటే కొత్త పల్లవి అందుకున్నారు. పోనీ వయోభారం వల్ల కావొచ్చు.. లేక కొడుకు ఏమైపోతాడోనన్న ఆందోళన వల్ల కావొచ్చు.. తండ్రి అలా మాట్లాడుతున్నారు అనుకుంటే.. కొడుకు కూడా అలాగే తయారయ్యారని చంద్రబాబు, నారా లోకేష్‌(Nara Lokesh)లను ఇద్దరినీ మంత్రి పేర్ని నాని ఏకిపారేశారు. చంద్రబాబు తాను మునిగిందే గంగ అనుకునే రకం. నిన్నటిదాకా ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగే కొనసాగించాలన్నది ఈ తండ్రీ కొడుకులే అని చెబుతూ బాబు బతుకంతా యూ టర్న్ లే అని అసహనం వ్యక్తంచేశారు.

శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జామాత దశమ గ్రహం అని ఎన్టీఆర్ బాధపడింది ఇంకా ఎవరూ మర్చిపోలేదని అన్నారు. 1998లో బీజేపీతో బయటి నుండి సపోర్ట్ మాత్రమే అన్నారు. కానీ 1999లో ఏకంగా పొత్తు పెట్టుకున్నారు. 2004లో తాను చేసిన అతి పెద్ద తప్పు బీజేపీతో కలవడం అని అన్నారు. 2009లో బీజేపీతో పొత్తు పెట్టుకునేదే లేదన్నారు. 2014కి వచ్చేసరికీ మోదీని తిట్టిన చంద్రబాబే మళ్లీ మోదీ ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడారని మంత్రి గుర్తుచేశారు. చంద్రబాబు ఇలా ఎన్ని యూ టర్న్‌లు తీసుకుంటారని మంత్రి ప్రశ్నించారు. 

2019లో చివరికి కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగు దేశాన్ని వారితో కలపడానికి సిద్ధపడ్డారు. ఎన్నికలు అయ్యాక మళ్లీ కాంగ్రెస్ ఊసేత్తితే ఒట్టు. పేదలందరూ తనను తిట్టుకుంటున్నారు అని అర్థమై ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం కాదు అని కొత్త యూ టర్న్ తీసుకున్నారు అంటూ చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు నాయుడు, వారి దత్త పుత్రుడు పవన్ నాయుడు, సొంత పుత్రుడు లోకేష్ గారు తీసుకున్నన్ని యూ టర్న్‌లు ఎవరూ తీసుకుని ఉండరని మండిపడ్డారు. 

ఈ సందర్భంగా బీజేపి ఎంపీ సుజనా చౌదరిపై సైతం మంత్రి పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. సుజనా చౌదరి పేరుకేమో బీజేపీ.. లోపలేమో టీడీపీ అని ఎద్దేవా చేశారు. ఇంగ్లీష్ మీడియం చిన్నారులకు చేటు అంటున్న సుజనా చౌదరి.. కేంద్ర విద్యాలయాల్లో ఏ భాషలో చదువు చెబుతున్నారో చెప్పాలి అని ప్రశ్నించారు. ఈ విషయం వారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడగలరా అని నిలదీశారు. అంతేకాదు.. అసలు సుజనా చౌదరి పిల్లలు ఎక్కడ చదివారో చెప్పాలని మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు.

Trending News