AP, Telangana Rains: ఏపీ, తెలంగాణలో గోదావరి ఉదృతి.. హెచ్చరికలు జారీ

AP, Telangana Rains: మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరిలోకి వరద ఉధృతి స్వల్పంగా పెరుగుతోంది అని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ముందస్తుగా వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.

Written by - Pavan | Last Updated : Jul 21, 2023, 09:19 AM IST
AP, Telangana Rains: ఏపీ, తెలంగాణలో గోదావరి ఉదృతి.. హెచ్చరికలు జారీ

AP, Telangana Rains: మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరిలోకి వరద ఉధృతి స్వల్పంగా పెరుగుతోంది అని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ముందస్తుగా వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. వదర ప్రభావిత ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు విపత్తుల సంస్థ స్పష్టంచేసింది. ముందస్తు సహయక చర్యలకు అల్లూరి జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించినట్టు తెలిపారు. 

భారీ వర్షాలు నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. అత్యవసర సహయం కోసం 1070, 18004250101 24 టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా స్టేట్ కంట్రోల్ రూమ్ ని సంప్రదించాలని.. అక్కడ 24 గంటల పాటు సిబ్బంది మీకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం అని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.  
 
జిల్లాల్లో మండల స్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు, గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదన్నారు. వరదల కారణంగా నది ఆటుపోట్లకు గురయ్యే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదు అని హెచ్చరించారు. 

ఇదిలావుంటే, తెలంగాణలోనూ గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్నందున తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు. 

 

అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సహా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. భద్రాచలంలో ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ సీఎస్ శాంతి కుమారికి సూచించారు. 

Trending News