విశాఖ: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటన తర్వాత తొలిసారిగా విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అక్కడ ఘన స్వాగతం లభించింది. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ అమరావతిలో రైతులు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తుండగా... విశాఖలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపించింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన సీఎం జగన్‌కు విశాఖ వాసులు ఘన స్వాగతం పలికి యావత్ రాష్ట్రం దృష్టిని బీచ్ సిటీ వైపు తిరిగిచూసేలా చేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ జంక్షన్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, రైల్వేస్టేషన్ రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సిరిపురం జంక్షన్, చిన వాల్తేరు, కురుపాం టూంబ్, అప్పూ ఘర్ జంక్షన్ మీదుగా కైలాసగిరి వరకు దాదాపు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారంగా ఏర్పడి మరీ విశాఖ వాసులు వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. గతంలో ఎందరో ముఖ్యమంత్రులు.. ఎన్నో సందర్భాల్లో విశాఖ పర్యటనకు వెళ్లినప్పటికీ.. శనివారం వైఎస్ జగన్‌కు లభించినంతటి ఘన స్వాగతం మాత్రం ఇదివరకు ఎవ్వరికీ లభించలేదు అనేంతలా మానవహారంలా నిలబడి సీఎంకు స్వాగతం పలకడం విశేషం.
దారిపొడవునా ఘన స్వాగతం.. పలు చోట్ల సెల్ఫీల కోసం యత్నం..
సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు దారి పొడవునా అడుగడుగునా అభిమానులు ఆసక్తి ప్రదర్శించారు. సీఎం వాహనంపై పూల వర్షం కురిపించి ఆయనపై ఉన్న అభిమానాన్ని, కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు. పలు చోట్ల రోడ్డు మీదకు దూసుకువచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. కారులో ఉన్న సీఎంతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ముందుకు వస్తున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలను అదుపు చేయడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఓపికతో నిలబడి ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించడంతో పాటు, గాలిలో బెలూన్లు వదిలి తమ అభిమాన నేతకు ఘన స్వాగతం పలికారు.
రాజకీయవర్గాల్లో చర్చనియాంశంగా మారిన సీఎం జగన్ విశాఖ పర్యటన..
పలుచోట్ల డోలు వాయిద్యాలు, జానపద నృత్యాలతో సందడి చేశారు. వీటన్నింటి మధ్య నుంచే సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ ముందుకు సాగిపోయింది. మొత్తానికి సీఎం వైఎస్ జగన్‌కు లభించిన అపూర్వ స్వాగతం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనియాంశమైంది. మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత అమరావతిలో వైఎస్ జగన్ సర్కార్‌పై వ్యతిరేకత వ్యక్తంకాగా విశాఖలో మాత్రం సానుకూల స్పందన లభించడం స్పష్టంగా కనిపించింది.
వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికిన విశాఖ.. పలు చోట్ల పూల వర్షం