AP CID Police to serve notice to MP Raghurama Krishna Raju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు అందజేశారు. గతంలో రఘురామపై నమోదైన దేశ ద్రోహం కేసుతో పాటు పలు ఇతర కేసుల్లో మొత్తం నాలుగు నోటీసులు ఇష్యూ చేశారు. ఈ నెల 13, 14, 16, 17 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బుధవారం (జనవరి 12) ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ నివాసానికి సీఐడీ పోలీసులు చేరుకుని నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా రఘురామ కుమారుడు భరత్ సీఐడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. నోటీసులు తనకు ఇవ్వాలని భరత్ కోరగా.. నేరుగా రఘురామ కృష్ణరాజుకే అందజేస్తామని సీఐడీ అధికారులు చెప్పారు. నోటీసులు తనకివ్వడానికి అభ్యంతరమేంటని భరత్ అధికారులను ప్రశ్నించారు. దీంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
రఘురామ నరసాపురం పర్యటనకు ముందు సీఐడీ నోటీసులు :
రఘురామ నరసాపురం పర్యటనకు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. తన నియోజకవర్గం నరసాపురంలో రఘురామ అడుగపెట్టక దాదాపు రెండేళ్లవుతోంది. గతేడాది సంక్రాంతి సమయంలో నరసాపురం వస్తానని ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. వైసీపీ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ పర్యటనను విరమించుకున్నారు. తాజాగా నరసాపురంలో పర్యటించబోతున్నట్లు మరోసారి ప్రకటించారు. ఈ నెల 13 నుంచి రెండు రోజుల పాటు అక్కడే ఉంటానని తెలిపారు. ఇంతలోనే ఏపీ సీఐడీ పోలీసులు రఘురామకు నోటీసులు ఇష్యూ చేసేందుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishna Raju) వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా నిత్యం వైసీపీ ప్రభుత్వ, పార్టీ విధానాలను రఘురామ విమర్శిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రఘురామ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రెడ్లు, క్రిస్టియన్ సామాజికవర్గాలను టార్గెట్ చేసి గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై రాజ ద్రోహం కేసు నమోదవడం... సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. పోలీస్ కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ అప్పట్లో ఆరోపించారు. ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించి ఎట్టకేలకు బెయిల్ పొందగలిగారు. అప్పటి నుంచి రఘురామ ఢిల్లీ, హైదరాబాద్‌లకే పరిమితమయ్యారు.
Also Read: Viral Video: వీధి కుక్కపై పోలీస్ అధికారి క్రూరత్వం.. దుడ్డు కర్రతో చావబాదాడు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook