ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు సీఆర్‌డీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల భవనాల మోడళ్లను పరిశీలించారు. ఆ తర్వాత విజయవాడ సిటీ స్క్వేర్ నిర్మాణంపై నగర ప్రజలలో అవగాహన కల్పించి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రస్తుతం అమరావతిలో 5 క్లష్టర్లలో 68 టవర్లుగా వీఐపీ గృహాలు, 12 అంతస్థులుగా ఒక్కో టవర్ నిర్మాణంతో పాటు, శాసనసభ్యులు, ఐఎఎస్ అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, నాలుగోతరగతి ఉద్యోగులకు 5 క్లష్టర్లలో గృహాలు, మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు బంగ్లాలు, ఒక్కొక్క బ్లాకులో 4 బంగ్లాలు చొప్పున నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో 15 రోజుల్లో ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తరహాలో రాజధానిలో ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణంతో పాటు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి సాధించడానికి వీలుగా కొంత భూమి కార్పొరేషన్‌కు కేటాయిస్తామని సీఎం చెప్పారు. "అమరావతి ప్రపంచశ్రేణి నగరం కాదు.. ప్రపంచంలో అత్యుత్తమ నగరం తాము నిర్మిస్తున్నామనేది ప్రతి అధికారి ఆలోచించాలని, ప్రతి నిర్మాణ సంస్థ అదే భావనతో పనిచేయాలని సీఎం ఈ సందర్భంగా తెలియజేశారు.